CM Kcr: నీతిఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా: సీఎం కేసీఆర్‌

దిల్లీలో ఆదివారం జరిగే నీతిఆయోగ్‌ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నానని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా

Updated : 06 Aug 2022 19:50 IST

హైదరాబాద్‌: దిల్లీలో ఆదివారం జరిగే నీతిఆయోగ్‌ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నానని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. చాలా బాధాకరమే అయినప్పటికీ ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపట్ల నిరసన తెలియజేయడానికి ఇదే ఉత్తమమైన మార్గంగా భావించినట్టు చెప్పారు. తమ  నిరసనను బహిరంగ లేఖ ద్వారా నేరుగా ప్రధానికి తెలియజేస్తున్నామని వెల్లడించారు.

‘‘స్వాతంత్ర్య పోరాటం జరిగే సమయంలోనే .. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అనేదానిపై చర్చలు జరిగాయి. స్వాతంత్ర్య భారతావని ఎలా ఉండాలనేదానిపై జరిగిన చర్చోపచర్చల ఫలితంగానే ప్లానింగ్‌ కమిషన్ ఆఫ్‌ ఇండియా ఏర్పడింది. దీని ద్వారా ప్రణాళికలు రూపకల్పన చేసి.. కేంద్రం ఎలా వ్యవహరించాలి, రాష్ట్రం ఎలా వ్యవహరించాలనేది నిర్ణయించారు. వార్షిక ప్రణాళికలు ఉండాలి, పంచవర్ష ప్రణాళికలు ఉండాలి... వాటిని అనుసరించి విజన్‌ఉండాలని ఆలోచనలు జరిగాయి. నెహ్రూ ప్రధాని అయిన తర్వాత ప్లానింగ్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా అమల్లోకి వచ్చింది. భారత ప్రణాళిక సంఘం అంటే ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉండేవి. ఎందరో మహానుభావులు అందులో సభ్యులుగా ఉన్నారు. దేశానికి అవసరమైన కీలక నిర్ణయాలు ప్రణాళిక సంఘం తీసుకునేది’’ అని సీఎం కేసీఆర్‌ వివరించారు.

నీతి ఆయోగ్‌ నిరర్థక సంస్థగా మారింది..!

‘‘ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లానింగ్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాను రద్దు చేసి దానికి ప్రత్యామ్నాయంగా నీతి ఆయోగ్‌ తీసుకొచ్చారు. నీతి ఆయోగ్‌ను టీమ్‌ ఇండియా అని పిలుస్తామని ప్రధాని మోదీ చెప్పారు. నీతిఆయోగ్‌ ద్వారా సహకార సమాఖ్య విధానాన్ని పాటిస్తారని భావించాం. దేశానికి మంచి రోజులు వస్తాయని ఆశించాం. కానీ, దురదృష్టవశాత్తూ నిరర్థక సంస్థగా మారింది. నేతి బీరకాయలో నెయ్యి చందంగా నీతి ఆయోగ్‌ పరిస్థితి తయారైంది. దేశంలో పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయి. దేశ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా 13 నెలల పాటు రైతులు ఆందోళన చేశారు. చివరకు నల్ల చట్టాలు రద్దు చేసి ప్రధాని స్వయంగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. ఆదాయం రెట్టింపు కాకపోగా ఖర్చులు రెట్టింపయ్యాయి. దేశంలో సాగుకు నీరు దొరకట్లేదు, విద్యుత్‌ లేదు.  భాజపా 8ఏళ్ల పాలనలో ఏం అభివృద్ధి జరిగింది? దేశ రాజధానిలో కూడా తాగడానికి మంచి నీళ్లు లేవు. నిరుద్యోగ సమస్య నానాటికీ పెరిగిపోతోంది. దేశం నుంచి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోతున్నాయి. దాదాపు 16 రాష్ట్రాల నుంచి ఉపాధి హామీ కూలీలు దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్దకు వెళ్లి ధర్నా చేసే పరిస్థితి ఏర్పడింది. అదుపులేకుండా పోతున్న ద్రవ్యోల్బణం, జీడీపీ పతనం, పెరుగుతున్న నిత్యావసర ధరలు అంతులేకుండా పెరుగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పాతాళానికి పడిపోయింది. దేశంలో పరిస్థితి చూస్తుంటే నీతి ఆయోగ్‌ ఏం ఒరగబెట్టింది? నీతి ఆయోగ్‌ సిఫార్సులను కూడా కేంద్రం గౌరవించడంలేదు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేసింది. కానీ, కేంద్రం పట్టించుకోలేదు’’ అని సీఎం కేసీఆర్‌ అసహనం వ్యక్తం చేశారు.

దిల్లీ నడివీధుల్లో కత్తులు పట్టుకుని స్వైర విహారం చేస్తున్నారు..

‘‘రాష్ట్రాలకు ప్రత్యేక పరిస్థితులు, సమస్యలు ఉంటాయి. కేంద్రం ఇచ్చే గ్రాంట్‌ నేరుగా రాష్ట్రాలకు ఇవ్వాలని చెబితే ప్రధానమంత్రి అంగీకరించారు. కానీ, అలా చేయడంలేదు. సహకార సమాఖ్య విధానం పోయి ఆదేశిత సమాఖ్య విధానం వచ్చింది. ‘మేము చెప్పింది చేయకపోతే మీ కథ చూస్తాం’ అనే పరిస్థితికి వచ్చారు. హనుమాన్‌ జయంతి రోజు దిల్లీ నడివీధుల్లో కత్తులు పట్టుకుని స్వైర విహారం చేస్తున్నారు. ఇదేనా.. నీతి ఆయోగ్‌ ఇచ్చే సందేశం. అంతర్జాతీయ విపణిలో మన దేశ పరువు పోతోంది. ఆర్థిక వేత్తలు ఎంత చెబుతున్నా పట్టించుకోవడంలేదు. నీతి ఆయోగ్‌ రూపకల్పనలో ఎవరికీ  ప్రమేయం ఉండదు. ఎవరు ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది. పన్నుల వసూలులో రాజ్యాంగపరంగా కొన్ని పద్ధతులు ఉన్నాయి. రాష్ట్రాలకు రావాల్సిన రూ.14లక్షల కోట్ల నిధులను కొల్లగొట్టారు. టీమ్‌ ఇండియా చేసే పని ఇదేనా? నీతి ఆయోగ్‌ సమావేశం భజన మండలి సమావేశంగా మారింది. ప్రగతిలో దూసుకెళ్తున్న రాష్ట్రాల కాళ్లలో కట్టెలు పెట్టవద్దని నీతి ఆయోగ్‌ సమావేశాల్లో చెప్పాను. దేశం మొత్తానికి విద్యుత్‌, నీళ్లు ఎలా ఇవ్వొచ్చో వివరించా. కానీ, నా సూచనలను నీతిఆయోగ్‌ పెడచెవిన పెట్టింది. రాష్ట్రంలో ఎన్నో పథకాలను నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. కేంద్రం నుంచి ప్రశంసలే తప్ప.. నిధులు రాలేదు. శుష్కప్రియాలు.. శూన్య హస్తాలు అన్నట్టు కేంద్రం విధానం ఉంది. కేంద్ర - రాష్ట్ర ఉమ్మడి పథకాల్లో తెలంగాణ రూ.1.92లక్షల కోట్లు ఖర్చు చేసింది. కేంద్రం నుంచి మాత్రం రాష్ట్రానికి రూ.5వేల కోట్లు  వచ్చాయి. కేంద్రానికి మేము పంపించిన ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలు చేశారు.  జీఎస్టీ బకాయిలు కూడా చెల్లించకుండా పెండింగ్‌లో ఉన్నాయి’’ అని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు.

మీరు కబళించిన రాజ్యాంగ సంస్థలే రేపు మిమ్మల్ని కబళిస్తాయి..

‘‘దేశంలో ఏకస్వామ్య పార్టీ విధానం వస్తుందని భాజపా జాతీయ అధ్యక్షుడు అన్నారు. ఈ నిరంకుశ విధానం దేశానికి మంచిదా? ప్రశ్నించిన రైతులను కార్లతో తొక్కించారు. రాజ్యాంగ సంస్థలను జేబు సంస్థలుగా వాడుకుంటున్నారు. మీరు కబళించిన రాజ్యాంగ సంస్థలే రేపు మిమ్మల్ని కూడా కబళిస్తాయి. దేశ మంతా ఏక్‌నాథ్‌ శిందేలను సృష్టిస్తామని బెదిరిస్తున్నారు.. ఇదేనా సమాఖ్య స్ఫూర్తి. ప్రభుత్వాలను కూల్చడమే సమాఖ్య విధానమా? పాలు, పెరుగు మీద పన్ను.. చివరికి శ్మశానంలో కూడా పన్ను వేస్తున్నారు. గార్భా అనే నృత్యం మీద కూడా పన్ను వేశారు. ఇప్పటికైనా ప్రధాని తన బుద్ధి మార్చుకుంటారనే సమావేశాన్ని బహిష్కరిస్తున్నా. ఉచిత పథకాలు రద్దు చేయాలని కొత్తగా తెరలేపారు. వృద్ధులకు పింఛన్లు ఇవ్వడం ఉచితమా? రైతులకు రైతుబంధు, రైతు బీమా ఇవ్వడం ఉచితమా? కొన్ని సంస్థలకు ఎన్‌పీఏల పేరిట రూ.12లక్షల కోట్లు ఇచ్చారు. ఎన్‌పీఏలు రూ.2లక్షల కోట్ల నుంచి 20లక్షల కోట్లకు పెరిగాయి.  మహత్తరమైన పాలన అందిస్తే ఎన్‌పీఏలు తగ్గాలి కదా? ఎందుకు 10 రెట్లు పెరిగింది. కొన్ని సంస్థలు, అధికారులు కుమ్మక్కై ఎన్‌పీఏలకు దోచిపెడుతున్నారు. కొందరు రూ.లక్షల కోట్లు బ్యాంకులకు ఎగవేసి విదేశాలకు పారిపోయారు. మేకిన్‌ ఇండియా అంటే పతంగులు ఎగరేసే మాంజా కూడా చైనా నుంచే వస్తుందా? మేకిన్‌ ఇండియాతో దిగుమతులు తగ్గాలా? పెరగాలా? ఇండియా భూభాగం 80కోట్ల ఎకరాలు. ఇందులు సాగుకు పనికొచ్చే భూమి 40కోట్ల ఎకరాలు. రూ.3లక్షల కోట్లు  బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసుకుని విదేశాలకు పారిపోతున్నారు. విదేశీ మారక నిల్వలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. మనదేశంలో కూడా శ్రీలంక పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు’’ అని సీఎం వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని