
TS News: సాగు చట్టాలపై కేసీఆర్ వైఖరి చెప్పాలి: మౌన దీక్షలో రేవంత్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన సాగు చట్టాలపై సీఎం కేసీఆర్ వైఖరి తెలపాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సాగు చట్టాలకు నిరసన తెలుపుతున్న రైతులపై యూపీలో జరిగిన దాడి ఘటనను ఖండించారు. ఉత్తర్‌ప్రదేశ్ లఖింపూర్ ఘటనను నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టిన మౌనదీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘‘మన సొంత భూముల్లోనే కూలీలుగా, బానిసలుగా మారే చట్టాలను తీసుకొచ్చి శాశ్వతంగా రైతుల జీవితం మీద మరణశాసనం రాస్తున్నారు. అమిత్ షా, మోదీలకు ఏ రైతులైతే రెండు సార్లు అధికారం అప్పజెప్పారో ఇవాళ ఆ రైతులే వారిని గద్దె దించాలని కంకణం కట్టుకున్నారు. చట్టాలను ఉపసంహరించుకునే వరకు దేశవ్యాప్తంగా ధర్నాలు, దీక్షలు, రాస్తారోకోలు చేపడుతున్నారు. తెలంగాణ రైతులు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యారు. మొదట్లో సీఎం కేసీఆర్ చట్టాలను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ దిల్లీకి వెళ్లొచ్చాక రైతుల గురించి ఒక్కమాట మాట్లాడట్లేదు’’ అని రేవంత్ విమర్శించారు.
ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మౌన దీక్షలో పాల్గొన్నారు. కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మౌన దీక్షలో ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ, హైదరాబాద్ పార్లమెంట్ ఇంఛార్జి ఫిరోజ్ ఖాన్, యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ యాదవ్‌లతో పాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి, పీఏసీ కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.