Cm Kcr: తెలంగాణ ప్రజలు దీవిస్తే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాం: సీఎం కేసీఆర్‌

‘‘1956లో జరిగిన చిన్న పొరపాటు వల్ల ఎంతో నష్టపోయాం. స్వాతంత్ర్యానికి ముందే హైదరాబాద్‌ సంస్థానంలో ఎంతో అభివృద్ధి

Updated : 05 Sep 2022 18:57 IST

నిజామాబాద్‌: ‘‘1956లో జరిగిన చిన్న పొరపాటు వల్ల ఎంతో నష్టపోయాం. స్వాతంత్య్రానికి ముందే హైదరాబాద్‌ సంస్థానంలో ఎంతో అభివృద్ధి కనిపించేది. 60 ఏళ్లు పోరాటం చేసి మళ్లీ తెలంగాణను సాధించుకున్నాం. ఇవాళ దేశం మొత్తం ఆశ్యర్యపోయే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలోనూ అమలుకావడం లేదన్నారు. రైతులకు ఉచితంగా నిరంతర విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. నిజామాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు.

రైతులకు మాత్రం ఉచితాలు ఇవ్వొద్దని..

‘‘కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఇప్పుడు రైతుల మోటార్ల లెక్కలు తీయమంటోంది. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని మోదీ చెబుతున్నారు. రైళ్లు, విమానాలు, ప్రభుత్వ సంస్థలు విక్రయించి.. ఇప్పుడు రైతుల మీద పడ్డారు. రైతుల భూములను తీసుకొని కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించాలని చూస్తున్నారు. ఎరువుల ధరలు, వ్యవసాయ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో సాగు భారంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఎన్‌పీఏల పేరుతో వ్యాపారులకు రూ.12 లక్షల కోట్లు దోచిపెట్టింది. రైతులకు మాత్రం ఉచితాలు ఇవ్వొద్దని ప్రధాని చెబుతున్నారు. ఇదంతా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి.

నిజామాబాద్‌ గడ్డ నుంచే జాతీయ రాజకీయ ప్రస్థానం..

2024లో దేశం భాజపా ముక్త్‌ భారత్‌ కావాలి. దేశం కోసం తెలంగాణ నుంచే పోరాటం ప్రారంభం కావాలి. బావి దగ్గర మీటర్లు పెట్టమనే సర్కారును సాగనంపాలి. రూ.1.20 లక్షల కోట్లు ఖర్చయ్యే ఉచిత విద్యుత్‌ ఇవ్వొద్దని మోదీ చెప్తున్నారు. 8ఏళ్లలో మోదీ సర్కారు ఒక్క ప్రాజెక్టుగానీ, పరిశ్రమగానీ నిర్మించిందా? దేశంలో ఉన్నవాటినే అమ్ముకుంటూ పోతున్నారు. ఎమ్మెల్యేలను కొనడం, ప్రభుత్వాలను కూలదోయడమే మోదీ చేస్తున్న ఏకైక పని. దేశ రాజకీయాల్లోకి రావాలని జాతీయస్థాయి రైతు నాయకులు నన్ను అడిగారు. తెలంగాణ ప్రజలు దీవిస్తే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాం. కాలువల్లో నీరు పారాలో? మతపిచ్చితో రక్తం పారాలో? ప్రజలు ఆలోచించుకోవాలి. నిజామాబాద్‌ గడ్డ నుంచే జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తా’’ అని కేసీఆర్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని