Cm Kcr: బీఆర్‌ఎస్‌ మొదటి కార్యక్షేత్రం మహారాష్ట్ర, కర్ణాటక: సీఎం కేసీఆర్‌

దేశాన్ని 75 ఏళ్లుగా ఏలిన పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా మారుస్తున్నట్టు ప్రకటించిన అనంతరం పార్టీ శ్రేణులనుద్దేశించి కేసీఆర్‌ మాట్లాడారు.

Updated : 06 Oct 2022 02:57 IST

హైదరాబాద్‌: దేశాన్ని 75 ఏళ్లుగా ఏలిన పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా మారుస్తున్నట్టు ప్రకటించిన అనంతరం పార్టీ శ్రేణులనుద్దేశించి కేసీఆర్‌ మాట్లాడుతూ.. దేశ ప్రజల ప్రయోజనాల కోసమే భారాస ఆవిర్భవిస్తోందని చెప్పారు. తెలంగాణ కోసం కష్టపడినట్లే దేశం కోసం పనిచేస్తామన్నారు. దేశ వ్యాప్తంగా తెలంగాణ మోడల్‌ అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర తమ మొదటి కార్యక్షేత్రాలని తెలిపారు. రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌తో కలిసి భారాస జెండా ఎగురవేస్తుందని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

‘‘జాతీయ పార్టీ పెట్టాలన్నది ఆషామాషీ నిర్ణయం కాదు. బలమైన పునాదులపైనుంచే జాతీయ పార్టీ నిర్ణయం తీసుకున్నాం. కుల, లింగ వివక్షలు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. అభివృద్ధిలో మహిళలు, ఎస్సీలు భాగం కాలేకపోతున్నారు. దళిత జనోద్దరణ కోసమే దళితబంధు కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. దేశ రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసేందుకే జాతీయ పార్టీ ద్వారా ముందడుగు వేశాం. దేశ ప్రజల సమస్యలనే అజెండాగా జాతీయ పార్టీ జెండాతో వెళ్తున్నాం. తెలంగాణ సీఎంగా ఉంటూనే దేశమంతా పర్యటిస్తా. కార్యక్షేత్రం వదలం..ఎవరికీ అనుమానం అక్కర్లేదు’’ అని కేసీఆర్‌ వివరించారు.

రైతు సంక్షేమమే ప్రధాన అజెండా..

దేశంలో చాలా పార్టీలకు రాజకీయం ఒక క్రీడలా మారిపోయిందని, కానీ తనకు అది ఒక టాస్క్‌ వంటిదని చెప్పారు. దేశంలో రైతుల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందన్న కేసీఆర్‌.. దేశంలో అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు తెలంగాణకే పరిమితం కావొద్దని చాలా మంది తనను కోరారన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, తెలంగాణ మోడల్‌ దేశంలో అమలు కావాలని చెప్పారు. రైతు సంక్షేమమే తమ పార్టీ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. విదేశాల నుంచి ప్రాసెసింగ్‌ ఫుడ్‌ దిగుమతి చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ములాయం సింగ్‌ యాదవ్‌ ఐసీయూలో ఉన్నందున ఈ సమావేశానికి అఖిలేష్‌ యాదవ్‌ను తానే రావొద్దని చెప్పినట్టు కేసీఆర్‌ తెలిపారు. భారాస ఆవిర్భావ కార్యక్రమానికి కలుద్దామని అఖిలేష్‌, తేజస్వీ యాదవ్‌కు చెప్పానని వెల్లడించారు. కలిసి ముందుకు సాగడానికి దేశ వ్యాప్తంగా అనేక పార్టీల నేతలు ముందుకొస్తున్నారని వివరించారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై  ఆర్థిక శాస్త్రవేత్తలు, పలు రంగాల నిపుణులతో అనేక దఫాలు చర్చలు జరిపామని కేసీఆర్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు