cm kcr: రూ.100 కోట్లతో కొండగట్టు అంజన్న ఆలయం అభివృద్ధి: సీఎం కేసీఆర్‌

జగిత్యాల పట్టణంలోని మోతెలో ఏర్పాటు చేసిన తెరాస భారీ బహిరంగసభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం చేతగాని విధానాల వల్ల తెలంగాణ రాష్ట్రం రూ.3లక్షల కోట్లు నష్టపోయిందని ధ్వజమెత్తారు.

Updated : 07 Dec 2022 17:54 IST

జగిత్యాల: నినాదాలు తప్ప ఎనిమిదేళ్లలో ప్రధాని మోదీ దేశానికి చేసిందేమీ లేదని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. జగిత్యాల పట్టణంలోని మోతెలో ఏర్పాటు చేసిన తెరాస భారీ బహిరంగసభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం చేతగాని విధానాల వల్ల తెలంగాణ రాష్ట్రం రూ.3లక్షల కోట్లు నష్టపోయిందని ధ్వజమెత్తారు. ‘‘మన చుట్టూ గోల్‌మాల్‌ గోవిందంగాళ్లు చేరారు. అప్రమత్తంగా లేకపోతే నష్టపోతాం. చిన్నపొరపాటు వల్ల 60 ఏళ్లు నష్టపోయిన చరిత్రమనది. జగిత్యాల జిల్లా అవుతుందని కలలో కూడా అనుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టే జగిత్యాల జిల్లా ఏర్పడింది. రాష్ట్రం కోసం ఉద్యమం జరిగే సమయంలో ధర్మపురి వచ్చినప్పుడు .. గోదావరి పుష్కరాలు మా దగ్గర ఎందుకు నిర్వహించరని ఆనాడు సింహంలా గర్జించా. తెలంగాణ గొప్ప దైవభక్తి ఉన్న ప్రాంతం. జగిత్యాల జిల్లాలో గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నా. అంజన్న ఆలయానికి ఇప్పటికే 384 ఎకరాలు ఇచ్చాం. ప్రఖ్యాత స్థపతులను తీసుకువచ్చి కొండగట్టును అభివృద్ధి చేస్తాం. యాదాద్రి క్షేత్రం వలే కొండగట్టును అభివృద్ధి చేస్తాం.

రైతులను కరెంటు బిల్లు అడిగే వాళ్లు ఉన్నారా?

వరద కాలువను అద్భుతమైన జలధారగా మార్చుకున్నాం. వరద కాలువ మీద ఇప్పటికే 13వేల మోటర్లు ఉన్నాయి. నేడు రైతులను కరెంటు బిల్లు అడిగే వాళ్లు ఉన్నారా?  ఇప్పుడు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం అంటోంది. పెడదామా..? రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కేసీఆర్‌ బతికి ఉన్నంత వరకు రైతు బంధు, రైతు బీమా ఆగదు. బీడీ కార్మికులను పట్టించుకున్న రాష్ట్రం ఏదైనా ఉందా? ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే బీడీ కార్మికులకు పింఛను ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వెయ్యి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశాం. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ తెలంగాణ నంబర్‌ వన్‌గా నిలిచింది. కరీంనగర్‌, జగిత్యాల జిల్లాలకు ఎమ్మెల్యే నిధులు మరో రూ.10కోట్లు పెంచుతున్నాం. నా వెంట నడవండి.. తెలంగాణ వస్తుందని చెప్పా. మనం చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే ప్రమాదంలో పడతాం. మనం అప్రమత్తంగా లేకపోతే మునిగిపోయే ప్రమాదం ఉంది. భారత రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలి. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఏ రంగంలో మంచి జరిగింది. 

ప్రజల సొత్తును మీ అబ్బసొత్తులాగా షావుకార్లకు కట్టబెడతారా?

మేకిన్‌ ఇండియా.. అని ఆయన డైలాగులు బాగా చెబుతారు. దీపావళికి పెట్టే దీపాలు కూడా చైనా నుంచి వస్తాయా? ఇదేనా మేకిన్‌ ఇండియా. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వగూడదట. ఎనిమిదేళ్లలో ఎన్‌పీఏల పేరుతో రూ.14లక్షల కోట్ల ప్రజల ఆస్తులను దోచిపెట్టింది భాజపా ప్రభుత్వం. ఎల్‌ఐసీలో 25లక్షల మంది ఏజెంట్లు పనిచేస్తారు. రూ.35 లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉన్న ఎల్‌ఐసీని అమ్మేస్తామంటున్నారు. ప్రజల సొత్తు మీ అబ్బసొత్తులాగా షావుకార్లకు కట్టబెడతామంటే యువత పిడికిలి బిగించాలి. ఏజెంట్‌ మిత్రులు స్పందించాలి. విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటు పరం చేయాలని మోదీ కుట్ర చేస్తున్నారు. మోదీ పార్టీకి నిధులిచ్చే వ్యాపారుల చేతిలో విద్యుత్‌ రంగాన్ని పెడుతున్నారు. వ్యాపారులు బాగుపడి రైతులు భిక్షమెత్తుకునేలా చేస్తున్నారు. సబ్‌ కా సాత్‌ సబ్‌కా వికాస్‌ ఎక్కడన్నా వికాసం ఉందా? అంగన్‌ వాడీలకు ఇచ్చే నిధుల్లో కోత పెట్టి బేటీ పడావో బేటీ బచావో అంటున్నారు. భారత దేశంలో పదివేల పరిశ్రమలు మూతపడి 50లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు’’ అని కేసీఆర్‌ విమర్శించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని