CM Kcr: నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టాలి: కేసీఆర్‌

ఎనిమిదేళ్ల పాలనలో దేశాన్ని భాజపా సర్వనాశనం చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోపించారు. భువనగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్‌ భన సముదాయాన్ని

Updated : 12 Feb 2022 20:51 IST

రాయగిరి: ఎనిమిదేళ్ల పాలనలో దేశాన్ని భాజపా సర్వనాశనం చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోపించారు. భువనగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం రాయగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు.‘‘ నాడు భువనగిరి ప్రజలు ఉద్యమంలో నా వెంట నడిచారు. భువనగిరి ప్రజలు బెబ్బులిలా తెలంగాణ కోసం పోరాటం చేశారు. ఒకప్పుడు కరెంటు కోసం కటకటలాడిన తెలంగాణ ఇవాళ దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచింది. ఎనిమిదేళ్లుగా కేంద్రం తెలంగాణను పట్టించుకోలేదు. అయినా, తలసరి ఆదాయంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాం. భువనగిరి జిల్లాలో ఉన్న వెనకబాటుతనం క్రమంగా తొలగిపోతోంది. కొద్ది రోజుల్లోనే ఈ ప్రాంతానికి కాళేశ్వరం జలాలు వస్తాయి.  కేంద్రం సహకరించకున్నా రాష్ట్రాన్ని అభివృధ్ధి వైపు తీసుకెళ్లాం. సమైక్య రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, వలసలు వెళ్లారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా సాగునీరు, విద్యుత్‌ ఉచితంగా ఇవ్వరు. ఇచ్చినా 24 గంటలూ ఇవ్వరు. తెలంగాణలోనే 24 గంటలు ఉచితంగా  ఇస్తున్నాం.

బెదిరిస్తే... కేసీఆర్‌ భయపడతాడా?

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పిచ్చి ముదిరి పిచ్చి పిచ్చి చట్టాలు తెస్తున్నారు. నల్లచట్టాలు తెచ్చి ఏడాది పాటు రైతులను ఏడిపించారు. దిల్లీలో సరిహద్దుల్లో రైతులపై లాఠీఛార్జి చేశారు. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తే రైతులకు భయపడి నల్ల చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రధాని ప్రకటించి దేశానికి క్షమాపణలు చెప్పారు. విద్యుత్‌ సంస్కరణలు అమలు చేస్తేనే డబ్బులిస్తాం.. లేకపోతే ఇవ్వమని చెబుతున్నారు. విద్యుత్‌ మోటార్ల వద్ద మీటర్లు పెడదామా? నేను చనిపోయినా సరే.. విద్యుత్‌ సంస్కరణలు ఒప్పకోను. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టాలి. 8 ఏళ్ల భాజపా పాలన దేశాన్ని సర్వనాశనం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మనవరకూ రావాలి కదా. ఏ రంగానికి మంచి చేశారు... ఎవరికి లాభం జరిగింది. ఇది మాట్లాడితే.. కేసీఆర్‌ నీ సంగతి చూస్తామంటున్నారు. ఏం చూస్తారు నా.. సంగతి. కేసీఆర్‌ భయపడతాడా? భయపడితే తెలంగాణ వచ్చేదా? విద్యార్థులు, మేధావులు ఆలోచన చేయాలి.

సిలికాన్‌ వ్యాలీని కశ్మీర్‌ వ్యాలీగా మారుస్తారా?

శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. ఈ దేశం ఎవడి అయ్య సొత్తు కాదు. దేశాన్ని నాశనం చేస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరు. కర్ణాటకలో విద్యార్థులపై రాక్షసంగా ప్రవర్తించవచ్చా?  సాఫ్ట్‌వేర్‌ రంగానికి ఇండియన్‌ సిలికాన్‌ వ్యాలీ బెంగళూరు మొదటి స్థానంలో ఉంటే రెండో స్థానంలో హైదరాబాద్‌ ఉంది. సిలికాన్‌ వ్యాలీని కశ్మీర్‌ వ్యాలీగా మారిస్తే పెట్టుబడులు ఎవరు పెడతారు?దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగింది నిజం కాదా? పారిశ్రామిక ఉత్పత్తులు పడిపోతున్నాయి. దేశంలో 15.. 16లక్షల పరిశ్రమలు మూతపడిన విషయం వాస్తవం కాదా? 140 కోట్ల మంది ఉన్న ఈ దేశంలో మత విద్వేషంతో ఎవరి కడుపు నిండుతుంది. మత పిచ్చి అవసరమా? మోదీ.. ఏరంగానికి మేలు చేశారు. మోదీ పాలనలో ఇప్పటికే దేశం నష్టపోయింది. రాజకీయంగా స్పందించకపోతే దేశం నాశనమైతుంది. చాలా బాధతో ఈ మాట చెబుతున్నా. అమెరికాలాంటి దేశాల్లో మత పిచ్చి ఉండదు.. అందుకే అభివృద్ధి చెందింది. రాహుల్‌ను ఉద్దేశించి అసోం సీఎం చేసిన వ్యాఖ్యలు నన్ను కలచివేశాయి. రాహుల్‌గాంధీ నాన్న, నాయనమ్మ దేశం కోసం అమరులయ్యారు. మోదీ గారు.. అసోం సీఎం చేసిన వ్యాఖ్యలే మీ సంస్కారమా? అసోం ముఖ్యమంత్రిని వెంటనే భర్తరఫ్‌  చేయాలి.

కేంద్రం అవినీతి చిట్టా అందింది

ఆకలి రాజ్యాల జాబితాలో భారత్‌ 101వ స్థానంలో ఉంది. మోదీ పాలనలో దేశాన్ని ఆకలి రాజ్యంగా మార్చారు. కరోనా సమయంలో మోదీ తెలివితక్కువ లాక్‌డౌన్‌ నిర్ణయం వల్ల కోట్లాది మంది ఇబ్బందులు పడ్డారు. కేంద్రంలో జరిగే అవినీతి బాగోతాల చిట్టా నాకు అందింది. నిన్నే మమతా బెనర్జీ , మొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే మాట్లాడారు. కేంద్రంపై అందరం కలిసి పోరాటం చేయాలి. నిన్న జనగామలో మాట్లాడితే భాజాపా నేతలు.. నువ్వెంత అని నన్ను విమర్శిస్తున్నారు. తెలంగాణ సమాజం మేల్కొనాలి.. దొంగలతో పోరాటం చేయాలి. దేశ రాజకీయాల్లో మొలిచిన కుక్కమూతి పిందె ఈ భాజపా. ఈ దరిద్రాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటేనే.. ఈ దేశానికి అంతా మంచి జరుగుతుంది. దేశమంతా తిరిగి అన్ని భాషల్లో వీరి భాగోతాలు చెబుతా’’ అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని