Updated : 27 Apr 2022 14:08 IST

TRS Plenary: దేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణలో పాలన: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: తెరాస తెలంగాణ ప్రజల ఆస్తి అని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే కాపలాదారు అని చెప్పారు. ఎన్నో ఒడుదొడుకులు, అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న తెరాస ప్లీనరీలో కేసీఆర్‌ మాట్లాడారు. తొలుత ప్లీనరీ వేదికపై తెరాస జెండాను సీఎం ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. దేశానికే రోల్‌ మోడల్‌గా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నామని.. కేంద్రం, వివిధ సంస్థల నుంచి వస్తున్న అవార్డులే తెలంగాణ ప్రగతికి నిదర్శనమని కేసీఆర్‌ చెప్పారు. దేశంలోనే ఉత్తమ గ్రామాల జాబితాలో మొదటి 10 తెలంగాణ గ్రామాలే ఉన్నట్లు కేంద్రం ప్రకటించిందని గుర్తు చేశారు. 

కఠినంగా వ్యవహరించినందునే ఈ ఫలితాలు

‘‘కఠిన నిర్ణయం తీసుకుని నూతన పంచాయతీరాజ్‌ చట్టం తీసుకొచ్చాం. 85 శాతం మొక్కలు దక్కకుంటే తెరాస అయినా సర్పంచ్‌, గ్రామ కార్యదర్శి ఉద్యోగాలు పోతాయని చెప్పాం. పల్లె ప్రగతి పేరిట ఏటా రెండు, మూడు సార్లు డ్రైవ్‌ పెట్టాం. మంత్రులు, ఎమ్మెల్యేలను దీనిలో భాగస్వామ్యం చేశాం. అందుకే ఈ ఫలితాలు వచ్చాయి. జ్ఞానాన్ని స్వీకరించే గుణం ఉండాలి.. అన్నీ మనకే తెలుసనే అహంకారం ఉండకూడదు.  అవినీతిరహితంగా, చిత్తశుద్ధితో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్తున్న పార్టీ తెరాస. పాలమూరు-రంగారెడ్డిని పూర్తిచేసుకుంటే మరింత సస్యశ్యామలం అవుతుంది. అంకితభావంతో పనిచేసినందునే రాష్ట్రంలో నేడు విద్యుత్‌ సమస్య లేదు. ఎందరో మహానుభావులు, పార్టీ శ్రేణుల కష్టమే తెరాసకు ఈ విజయాలు. కర్ణాటకలో అవినీతికి పాల్పడి ఒకరు మంత్రి పదవి కోల్పోయారు. ఆ తరహా పరిస్థితి తెలంగాణలో లేదు. ధరణి ద్వారా రైతులు, భూ యజమానుల సమస్య పూర్తిగా తీరింది. గొప్పలు చెప్పుకొని పొంగిపోవడం లేదు.. వాస్తవాలు మాట్లాడుకుంటున్నాం.   

దేశానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్‌లు కాదు.. ప్రత్యామ్నాయ అజెండా

స్వాతంత్ర్య ఫలాలు లభించాల్సిన పద్ధతిలో దేశ ప్రజలకు లభించలేదు. అవాంఛితమైన, అనవసర పెడధోరణులు సమాజంలో పెరుగుతున్నాయి. ఇలాంటి దురాచారాలు, దురాగతాలు అవసరం లేదు. దేశం ఉనికికే ముప్పు ఏర్పడే స్థాయికి ఈ పెడధోరణులు పెరుగుతున్నాయి. దేశ పరిరక్షణ కోసం మనం కృషి చేయాల్సిన అవసరముంది. చదువుకున్నవాళ్లకు కూడా కొన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన లేదు. గుజరాత్‌లోనూ విద్యుత్‌ కొరతతో పంటలు ఎండిపోతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ వంటి అనేక రాష్ట్రాల్లో విద్యుత్‌ కోతలున్నాయి. ప్రకటిత, అప్రకటిత కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కానీ తెలంగాణలో నిరంతర విద్యుత్‌తో  వెలుగులు కనిపిస్తున్నాయి. దేశానికి రాజకీయ ఫ్రంట్‌లు కాదు.. ప్రత్యామ్నాయ అజెండా కావాలి. నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానం రావాల్సిన అవసరముంది. ప్రత్యామ్నాయ రాజకీయ అజెండా ఎవరినో ప్రధానిని చేసేందుకు కాదు. 

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ప్రతిపాదనలు వస్తున్నాయ్‌

2000 సంవత్సరంలో నేను తెలంగాణ గురించి మాట్లాడితే తిన్నది అరగట్లేదా? అన్నారు. నేను తల్లిదండ్రులు, భగవంతుడికి దండం పెట్టి అడుగు ముందుకేశా. ఈ 20 ఏళ్లలో మన తెలంగాణ ఏ పరిస్థితుల్లో ఉందో చూడండి. 11 రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వలస వచ్చి ఉపాధి పొందుతున్నారు. భారత్‌ వద్ద తగినంత ఆర్థిక వనరులు ఉన్నాయి. అభివృద్ధి చేయాలనే సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే అది జరిగి తీరుతుంది. దేశం బాగు కోసం మన రాష్ట్రం నుంచి అడుగులు పడితే మనకే గర్వకారణం. దేశ గతి, స్థితి మార్చడానికి కొత్త అజెండా కావాలి. సరైన ప్రగతి పంథాలో నడిపించేందుకు కొత్త సిద్ధాంతం రావాలి. హైదరాబాద్‌ వేదికగా ఆ అజెండా వస్తే అది మనకే గర్వకారణం. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) రావాలనే ప్రతినిపాదనలు కూడా వస్తున్నాయి. కొత్త రాజకీయ అజెండా కోసం దారులు వెతకాలి. 

నీటి యుద్ధాలు చేసుకునే దౌర్భాగ్య పరిస్థితులు ఎందుకు?

దేశంలో సజీవంగా ప్రవహించే నదుల్లో ఉండే నీటిలభ్యత 65వేల టీఎంసీలు. మరికొన్ని టీఎంసీల లెక్కలు తేలాల్సి ఉంది. 65వేల టీఎంసీలకు గాను కేవలం 30వేల టీఎంసీల లోపే దేశం వాడుకుంటోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో నీటి యుద్ధాలు జరుగుతున్నాయి. కావేరి జలాల కోసం తమిళనాడు- కర్ణాటక మధ్య, సింధు-సట్లెజ్‌ నదీ జలాల కోసం పంజాబ్‌-హరియాణా మధ్య యుద్ధం జరుగుతోంది. నీటికోసం యుద్ధాలు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం ఎందుకు ఏర్పడింది? తాగు, సాగునీరు లేక దేశం ఎందుకు అల్లాడుతోంది? ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి మనదేశంలో ఉంది. భారత పౌరులు విదేశాల్లో తమ శక్తిసామర్థ్యాలను ధారపోస్తున్నారు. భారత పౌరులు అమెరికాలో గ్రీన్‌కార్డు వచ్చిందంటే ఇక్కడ ఇరుగుపొరుగువారితో వారి కుటుంబసభ్యులు పార్టీలు చేసుకుంటున్నారు.. ఎందుకీ దౌర్భాగ్యం. మనకి ఆస్తి, నీరు, ఖనిజ సంపద, అటవీ సంపద, మేధోసంపత్తి లేదా? ఎందుకు దేశం ఇలా కునారిల్లుతోంది? ఈ దౌర్భాగ్య పరిస్థితులు ఎందుకు? పరిస్థితులు ఇలాగే ఉండాలా? ప్రజలంతా ఆలోచించాల్సిన అవసరముంది. వసతులు, వనరులు, యువశక్తిని వినియోగించి దేశం అద్భుతంగా పురోగమించాలి.

సింగపూర్‌ అలా.. మనమెందుకు ఇలా?

ఏమీ లేని సింగపూర్‌ అద్భుతంగా రాణిస్తోంది. మట్టి కూడా వాళ్లు పొరుగుదేశం ఇండోనేషియా నుంచి నౌకల్లో దిగుమతి చేసుకుంటారు. కూరగాయలు కూడా వాళ్ల దగ్గర పండవు. ఆ దేశంలో ఏమీ లేదు.. కానీ అక్కడ ఎందుకంత అభివృద్ధి జరిగింది? మన దగ్గర అన్నీ ఉన్నా నేతలకు వాటిని ఉపయోగించుకునే తెలివితేటలు లేవు. ఇది నిప్పులాంటి నిజం.. హేతుబద్ధమైన వాదం.. కఠోరమైన వాస్తవం. రాజకీయ రణగొణ ధ్వనులు, మైకులు పగిలిపోయే ఉపన్యాసాలతో స్వాతంత్ర్యం తర్వాత 75 ఏళ్ల జీవితం గడించింది తప్ప ప్రజల ఆశయాలు మాత్రం నెరవేరలేదు.

గాంధీనే దూషిస్తున్నారు.. ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తికి ఇదేనా గౌరవం?

మహాత్మాగాంధీనే దూషిస్తున్నారు.. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తికి ఇదా గౌరవం? భాజపా నేతలు దేశాన్ని అన్ని రంగాల్లో నాశనం చేశారు. రాజకీయం స్వార్థం కోసం విధ్వంసం చేయడం చాలా తేలిక. బెంగళూరులో హిజాబ్‌ వంటి అంశాలను తెరపైకి తెచ్చారు. దేశంలో మత విద్వేషం మంచిదా? ఇది ఎక్కడికి దారి తీస్తుంది? రాజకీయ సందర్భం వస్తే చాఉల విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. దేశ రాజధానిలోనే కత్తులు, తుపాకులు పట్టుకునే పరిస్థితి ఉంది. ఇలాంటి ధోరణి  భారత రాజ్యాంగ స్ఫూర్తా? దేశం సరైన పద్ధతిలో ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త రాజకీయ శక్తి అవసరం. అద్భుత అజెండాతో అది ఆవిర్భవించాలి. ఆ శక్తిలో తెరాస ఉజ్వలమైన పాత్ర పోషిస్తుంది. 

ఎన్టీఆర్‌పై దుర్మార్గమైన గవర్నర్ల వ్యవస్థను ప్రయోగించారు..

గవర్నర్ల వ్యవస్థ పెడ ధోరణి, వింతధోరణితో వ్యవహరిస్తోంది.  గవర్నర్ల వ్యవస్థతో మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ్‌బెంగాల్‌లో పంచాయితీ నడుస్తోంది. ఎన్టీఆర్‌పై దుర్మార్గమైన గవర్నర్ల వ్యవస్థను ప్రయోగించారు. స్వచ్ఛమైన పాలన చేస్తున్న ఎన్టీఆర్‌ను పదవి నుంచి తొలగించారు. ఎన్టీఆర్‌ను పీఠంపై కూర్చోబెట్టేంతవరకు ప్రజలు కొట్లాడారు. ఎన్టీఆర్‌ పట్ల గవర్నర్‌ తీరు, నాటి పరిణామాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి’’ అని కేసీఆర్‌ అన్నారు.

 


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని