Chandrababu: శపథం నెరవేరి.. సగర్వంగా సభలోకి

తన సతీమణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అంబటి రాంబాబు మాట్లాడటం, దానికి ఇతర వైకాపా సభ్యులు వంతపాడటం, సభా నాయకుడిగా వారించాల్సిన అప్పటి సీఎం జగన్‌ వెకిలి నవ్వులతో వారిని ప్రోత్సహించడంతో చంద్రబాబు ఆ రోజు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. 

Updated : 22 Jun 2024 06:50 IST

అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లి లోపలికి ప్రవేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
శాసనసభ్యులు ప్రవేశించే ద్వారంలో నుంచి సభలోకి
జయజయధ్వానాలతో స్వాగతం పలికిన తెదేపా, మిత్రపక్షాల సభ్యులు
ఈనాడు - అమరావతి

శాసనసభలోకి అడుగుపెట్టే ముందు నేలకు మొక్కుతున్న సీఎం చంద్రబాబు

తన సతీమణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అంబటి రాంబాబు మాట్లాడటం, దానికి ఇతర వైకాపా సభ్యులు వంతపాడటం, సభా నాయకుడిగా వారించాల్సిన అప్పటి సీఎం జగన్‌ వెకిలి నవ్వులతో వారిని ప్రోత్సహించడంతో చంద్రబాబు ఆ రోజు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.  ప్రజాక్షేత్రంలోకి వెళ్లి మళ్లీ ముఖ్యమంత్రయ్యాకే అసెంబ్లీకి వస్తానని ప్రకటించి సభ నుంచి బయటకు వచ్చేశారు. అసెంబ్లీలో జరిగిన అవమానంతో మానసికంగా తీవ్రంగా కుమిలిపోయిన చంద్రబాబు... అనంతరం పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశానికీ విషణ్ణ వదనంతోనే వచ్చారు. పొంగుకొస్తున్న దుఃఖాన్ని అదిమి పెట్టుకుంటూ, గద్గద స్వరంతో మాట్లాడారు. సభలో తన భార్యను అవమానించేలా అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించడాన్ని ప్రస్తావిస్తూ దుఃఖాన్ని నియంత్రించుకోలేక, వెక్కి వెక్కి ఏడ్చేశారు. శపథం చేసినట్టుగానే ఆ రోజు నుంచీ ఆయన సభలో అడుగుపెట్టలేదు. 

సభలో ‘నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది’ అని ప్లకార్డులు ప్రదర్శిస్తున్న మంత్రులు అచ్చెన్నాయుడు, లోకేశ్, రామానాయుడు, ఎమ్మెల్యేలు


నేడు విజయగర్వంతో సభలోకి!

2024 జూన్‌ 21

ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్‌ వచ్చి అసెంబ్లీ ప్రధాన ద్వారం ఎదుట ఆగింది. కారులో నుంచి చంద్రబాబు సగర్వంగా దిగారు. భారీ సంఖ్యలో చేరుకున్న మంత్రులు, తెదేపా, జనసేన, భాజపా ఎమ్మెల్యేలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ‘గౌరవ సభకు స్వాగతం’ అని నినాదాలు చేశారు. చంద్రబాబు వారందరికీ నమస్కరించారు. అసెంబ్లీ మెట్ల వద్ద మోకాళ్లపై కూర్చుని, శిరసు వంచి ప్రణమిల్లారు. పవిత్ర దేవాలయం వంటి శాసనసభ మెట్లను కళ్లకు అద్దుకున్నారు. తనను అవమానించిన వైకాపాను ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించి, మిత్రపక్షాలతో కలసి 164 మంది ఎమ్మెల్యేల్ని గెలిపించుకున్న విజయగర్వంతో, చేసిన శపథం ప్రకారం మళ్లీ ముఖ్యమంత్రిగా సభలో అడుగుపెట్టారు.

చంద్రబాబు ఆ రోజు అవమానభారంతో, బరువెక్కిన గుండెతో శాసనసభ నుంచి ఏ మార్గంలో, ఏ మెట్ల మీదుగా బయటకు వచ్చారో.. అదే మెట్ల మీదుగా, అదే మార్గంలో మళ్లీ శాసనసభలో ప్రవేశించారు. ముఖ్యమంత్రి సభలోకి ప్రవేశించే మార్గం ప్రత్యేకంగా ఉంటుంది. సీఎం కాన్వాయ్‌ నేరుగా అక్కడి వరకు వెళుతుంది. అక్కడే కాన్వాయ్‌ దిగి సీఎం తన కార్యాలయంలోకి వెళతారు. అక్కడి నుంచి సభలోకి ప్రవేశించేందుకు ప్రత్యేక ద్వారం ఉంటుంది. మంత్రులు, మిగతా ఎమ్మెల్యేలు ప్రధాన ద్వారం నుంచి సభలోకి వెళతారు. కానీ కౌరవసభను.. గౌరవసభగా మారుస్తానన్న తన శపథాన్ని నెరవేర్చుకున్నదానికి చిహ్నంగా చంద్రబాబు గురువారం శాసనసభ్యులంతా వెళ్లే ప్రధాన ద్వారం నుంచే సభలోకి అడుగుపెట్టారు. ఆ సందర్భంగా తెదేపా సభ్యుల్లో విజయోత్సాహం వెల్లివిరియడంతో పాటు, అక్కడ భావోద్వేగ వాతావరణమూ నెలకొంది. చంద్రబాబు శుక్రవారం ఉదయం 9.40 గంటల సమయంలో శాసనసభకు చేరుకున్నారు. అప్పటికే ప్రధాన ద్వారం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న చేరుకున్న తెదేపా, మిత్రపక్షాల ఎమ్మెల్యేలు, నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. శాసనసభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే తెదేపా, జనసేన, భాజపా సభ్యులంతా ‘నిజం గెలిచింది... ప్రజాస్వామ్యం నిలిచింది’ అన్న ప్లకార్డులు ప్రదర్శించారు.


నాడు అవమానభారంతో బయటకు..

2021 నవంబరు 19

‘ఇన్ని సంవత్సరాలూ పరువు కోసం బతికాను. అలాంటిది ఈ రోజు సభలో నా భార్య ప్రస్తావన తెచ్చి అసభ్యంగా వ్యాఖ్యలు చేశారు. ఇది గౌరవ సభ కాదు. కౌరవ సభ. ఇలాంటి సభలో నేను ఉండను. మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగుపెడతాను. లేకపోతే నాకు రాజకీయాలే వద్దు. మీ అందరికీ ఒక నమస్కారం’

తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర అవమానభారంతో నాడు శాసనసభలో చేసిన భీషణ ప్రతిజ్ఞ ఇది.


పవన్‌ కల్యాణ్‌కు ఘన స్వాగతం 

తొలిసారి శాసనసభలో అడుగుపెట్టిన ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు శుక్రవారం ఉదయం సాదర స్వాగతం లభించింది. శాసనసభ ప్రధాన ద్వారం ఎదుట ఆయనను జనసేన, తెదేపా, భాజపా ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఎదురేగి స్వాగతించారు. సోదరుడు నాగబాబు, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనందసాయి తదితర మిత్రులతో కలసి వచ్చిన పవన్‌కు పుష్పగుచ్ఛాలిచ్చి సభలోకి తీసుకెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని