CM Revanth Reddy: నాడు అరబిందో, అవంతిక కంపెనీలకు గనులమ్మితే ఎందుకు మాట్లాడలేదు కేటీఆర్‌?

గతంలో కేంద్రం నిర్వహించిన వేలం పాటల్లో బొగ్గు గనులను అరబిందో, అవంతిక కంపెనీలకు అమ్మేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదని మాజీ మంత్రి కేటీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

Updated : 22 Jun 2024 08:53 IST

ఎక్స్‌లో ప్రశ్నించిన సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: గతంలో కేంద్రం నిర్వహించిన వేలం పాటల్లో బొగ్గు గనులను అరబిందో, అవంతిక కంపెనీలకు అమ్మేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదని మాజీ మంత్రి కేటీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్‌ను ఉద్దేశించి శుక్రవారం ఎక్స్‌లో సీఎం పోస్టు పెట్టారు. మొదటి, రెండో విడత బొగ్గు గనుల వేలంలో ఈ రెండు కంపెనీలకు తెలంగాణలోని రెండు గనులను కేంద్రం కేటాయించినప్పుడు కేసీఆర్‌ సీఎంగా ఉన్నారని గుర్తుచేశారు. ఆ కంపెనీలపై భారాస ఎప్పుడూ ఎందుకు మాట్లాడలేదని, ఏమైనా వ్యక్తిగత ఒత్తిళ్లు ఉన్నాయా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆస్తులు, హక్కులు, భవిష్యత్తు... కాంగ్రెస్‌ చేతుల్లో భద్రంగా ఉందని, కేవలం బొగ్గు గనుల కోసమే కాకుండా ప్రజల ప్రతి హక్కు కోసం తాము పోరాడతామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గానీ, గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం గానీ ప్రజల వాటాలను అమ్మేయడం లేదా ప్రైవేటుపరం చేసినప్పుడు కాంగ్రెస్‌ నేతలంతా గట్టిగా వ్యతిరేకించారని ఆయన గుర్తుచేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరిన్ని గనులను వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలపడానికే కాకుండా గతంలో అరబిందో, అవంతిక కంపెనీలకు అమ్మేసిన గనులను సైతం వెనక్కి ఇవ్వాలని కోరడానికే గనుల వేలం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లారని సీఎం వివరించారు. గతంలో సింగరేణి గనులను, ఔటర్‌ రింగురోడ్‌పై టోల్‌ వసూలు హక్కులను అమ్మేసిన వ్యక్తి(కేటీఆర్‌) ఇప్పుడు మాట్లాడుతున్నారని సీఎం విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని