Revanth Reddy: రాజకీయ వ్యాపారులు వైఎస్సార్‌ వారసులు కారు

‘దేశంలో కాంగ్రెస్‌ బలంగా ఉండాలనేది వైఎస్సార్‌ ఆశయం. రాహుల్‌గాంధీ ప్రధాని కావాలనేది ఆయన కోరిక. బడుగు, బలహీనవర్గాలను అక్కున చేర్చుకోవాలనేది ఆయన ఆలోచన. 

Updated : 09 Jul 2024 07:16 IST

కార్యకర్తలకు, షర్మిలకు తోడుగా ఉంటాం
కడపలో ఉపఎన్నిక వస్తే అక్కడ ఊరూరూ తిరిగే బాధ్యత తీసుకుంటా
ఏపీలో కాంగ్రెస్‌ గెలుపుకోసం ఎలాంటి కార్యాచరణకైనా సిద్ధం
వైఎస్సార్‌ 75వ జయంతి సభలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి 

మంగళగిరిలో నిర్వహించిన వైఎస్సార్‌ సంస్మరణ సభలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. చిత్రంలో కాంగ్రెస్‌ నాయకులు దానం నాగేందర్, కేవీపీ రామచంద్రరావు, తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల, తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌ తదితరులు

ఈనాడు, అమరావతి-ఈనాడు డిజిటల్, అమరావతి: ‘దేశంలో కాంగ్రెస్‌ బలంగా ఉండాలనేది వైఎస్సార్‌ ఆశయం. రాహుల్‌గాంధీ ప్రధాని కావాలనేది ఆయన కోరిక. బడుగు, బలహీనవర్గాలను అక్కున చేర్చుకోవాలనేది ఆయన ఆలోచన. వైఎస్సార్‌ పేరు మీద రాజకీయ వ్యాపారం చేసే వారు వారసులా? ఆయన ఆశయం కోసం పనిచేసే వారు వారసులా? ప్రజలు ఆలోచించాలి. కుటుంబసభ్యులు అయినంత మాత్రాన వారసత్వం రాదు. ఆశయాలను మోసినప్పుడే వారసత్వం వస్తుంది. ఏపీలో సర్పంచి స్థానాన్ని కూడా కాంగ్రెస్‌ గెలవడం కష్టమని తెలిసినా... వైఎస్సార్‌ ఆశయాల సాధన కోసం పార్టీ జెండా పట్టుకుని షర్మిల నడుస్తున్నారు. పార్టీ బాధ్యతలు మోస్తున్నారు’ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘కడప లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక రావొచ్చని పత్రికల్లో చూశా. నిజంగానే వస్తే అక్కడ ఊరూరూ తిరిగే బాధ్యత తీసుకుంటా. ఆ గడ్డ మీద నుంచే పోరాటం మొదలుపెడదాం. కార్యకర్తలందరూ కలిసి రావాలి’ అని పిలుపునిచ్చారు. మంగళగిరిలో సోమవారం నిర్వహించిన వైఎస్సార్‌ 75వ జయంతి కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘షర్మిలకు తోడుగా ఉంటాం. ఏపీలో కాంగ్రెస్‌ను గెలిపించడానికి ఎలాంటి కార్యాచరణకైనా సిద్ధం. మేమంతా అండగా నిలబడతామని చెప్పడానికే మంత్రివర్గమంతా ఇక్కడికి వచ్చింది’ అని స్పష్టంచేశారు.  

2029లో షర్మిల సీఎం అవుతారు..

‘ఏపీలో అధికారంలో ఉండేది బీజేపీనే. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్‌. రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు. మొత్తం పాలక పక్షమే. ముగ్గురూ మోదీ పక్షమే. ప్రజల తరఫున మాట్లాడాలంటే ఒక నాయకురాలు కావాలి. ఆ నాయకురాలే షర్మిల. దిల్లీలో కొట్లాడేది షర్మిలనే. 2029లో ఏపీలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది.  షర్మిల తప్పకుండా సీఎం అవుతారు. 2029లో రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారు. ఇదే వైఎస్సార్‌ చివరి కోరిక’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు.

మంగళగిరిలో నిర్వహించిన వైఎస్సార్‌ సంస్మరణ సభలో ప్రసంగిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. చిత్రంలో కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు, తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్‌ నాయకుడు దానం నాగేందర్, తెలంగాణ మంత్రి డి.శ్రీధర్‌బాబు, సీపీఐ నేత నారాయణ, కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, కాంగ్రెస్‌ నేత మాణికం ఠాకూర్, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల, కేవీపీ రామచంద్రరావు, తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌అలీ

వైఎస్సార్‌తో నాది భిన్నమైన అనుభవం 

‘నాకు వైఎస్సార్‌తో భిన్నమైన అనుభవం ఉంది. 2007లో మొదటిసారి శాసనమండలి సభ్యునిగా సభకు వెళ్లినప్పుడు... వైఎస్సార్‌ ముందు బలమైన వాదన వినిపించాలని సివిల్స్‌ పరీక్షకు ప్రిపేర్‌ అయినట్లు రాత్రంతా చదువుకుని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రస్తావించే వాడిని. 2009లో రెండోసారి ఆయన సీఎం అయినప్పుడు నేను మొదటిసారి శాసనసభకు ఎన్నికయ్యా. అప్పుడూ అదే విధానాన్ని కొనసాగించా. మొదటి బడ్జెట్‌ సమావేశంలో ప్రధాన ప్రతిపక్షం తరఫున 40 నిమిషాలు మాట్లాడినా... కొత్త శాసనసభ్యుడిని ప్రోత్సహించాలనే ఆలోచనతో వైఎస్సార్‌ లేచి సమాధానమిచ్చేవారు. సంక్షేమం, అభివృద్ధి గురించి, ప్రజలతో మమేకమైన నాయకుడి గురించి చర్చ జరిగినప్పుడల్లా ఈ సమాజం వైఎస్సార్‌ గురించి గుర్తుచేసుకుంటుంది’ అని రేవంత్‌రెడ్డి కొనియాడారు. 

ఎప్పటికీ చిరస్మరణీయులే 

తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ... ‘ పార్టీని, పరిపాలనను రెండు కళ్లుగా భావించి రాజశేఖరరెడ్డి పనిచేశారు. ఆయన స్ఫూర్తితోనే తెలంగాణలో పనిచేస్తున్నాం’ అని కొనియాడారు. ‘వైఎస్సార్‌ మరణించి పదేళ్లు అవుతున్నా... ఇరు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఆయన ఎప్పటికీ చిరస్మరణీయులే’ అని మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ‘నా భర్తకు వైఎస్సార్‌ ప్రాణదానం చేశారు. రాజకీయ కారణాలతో ఆయన పేరును దశాబ్దకాలంగా మరుగున పడేశారు. ఆయన ఆశయాలను షర్మిల కొనసాగిస్తారు’ అని మంత్రి కొండా సురేఖ చెప్పారు. మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ... కష్టపడి పనిచేసే వారికి పార్టీలో అగ్ర ప్రాధాన్యం ఇచ్చిన ఘనత వైఎస్సార్‌దేనన్నారు. ‘తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ద్వారా రాజశేఖరరెడ్డి ఆశయం సగం నెరవేరింది. ఏపీలోనూ పార్టీ అధికారంలోకి రావాలి. రాహుల్‌ ప్రధాని కావాలి’ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ,  సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ,  సీపీఎం ఏపీ కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, జేడీ శీలం, పార్టీ నేతలు శైలజానాథ్, ఉండవల్లి అరుణ్‌కుమార్, తులసిరెడ్డి, కె.బాపిరాజు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి భానుప్రసాద్, సీనియర్‌ జర్నలిస్ట్‌ వల్లీశ్వర్‌ తదితరులు వైఎస్‌తో తమకున్న అనుభవాలను వెల్లడించారు. ఏపీ, తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జులు మాణికం ఠాగుర్, దీపాదాస్‌ మున్షీ పాల్గొన్నారు. 


మహోన్నత నేత వైఎస్సార్‌ 
 - సోనియా గాంధీ సందేశం 

రాజశేఖరరెడ్డి దేశానికే మహోన్నత నాయకుడు అని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ కొనియాడారు. పార్టీతో పాటు తన రాష్ట్రానికి, దేశానికి నిస్వార్థంగా, అంకితభావంతో సేవ చేసిన నిజమైన దేశభక్తుడని అన్నారు. ఈ మేరకు సోనియాగాంధీ సందేశాన్ని పంపారు. 


జోడో యాత్రకు వైఎస్సార్‌ పాదయాత్రే స్ఫూర్తి
- రాహుల్‌గాంధీ 

రాజశేఖరరెడ్డి నుంచి వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకున్నానని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఆయన అప్పట్లో చేపట్టిన పాదయాత్రే... తన జోడో యాత్రకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా రాహుల్‌ పంపిన వీడియో సందేశాన్ని సభలో ప్రదర్శించారు. ‘రాజశేఖరరెడ్డిలో ఉన్న ధైర్యం, నాయకత్వ లక్షణాల్ని షర్మిలలో చూశా. ఆయన వారసత్వాన్ని ఆమె సమర్థంగా ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం ఉంది’ అని రాహుల్‌ వీడియోలో పేర్కొన్నారు. 


జలయజ్ఞం కోసమే దేవుడు పుట్టించాడని అనేవారు  

- రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల

రాజశేఖరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించే భాజపాతో అంటకాగిన, ఆ పార్టీతో తెరవెనుక పొత్తులు పెట్టుకున్న వారు ఆయన వారసులు ఎలా అవుతారని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. మతాన్ని, సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే భాజపాను రాజశేఖరరెడ్డి వ్యతిరేకించేవారని ఆమె అన్నారు. ‘ముఖం నిండా చిరునవ్వు.. నడుచుకుంటూ వస్తే రాజసం వైఎస్సార్‌ ప్రత్యేకత. పాప్స్‌ అని నన్ను దగ్గరకు తీసుకునేవారు. నేను చివరిసారిగా కలిసినప్పుడు ఒక మాట అన్నారు. ఏమీ కానీ నన్ను ఇంత వాడిని చేసిన దేవుడు గొప్పవాడు. ఎంతో మంది పేదలకు జీవితాల్ని ప్రసాదించే అవకాశం ఇచ్చాడు. జలయజ్ఞం కోసమే దేవుడు నన్ను పుట్టించాడు అని చెప్పారు’ అని షర్మిల వివరించారు. 

నాన్న చాలా టెన్షన్‌ పడిన సందర్భం అదే

‘2009 ఎన్నికల ఫలితాల ముందు నాన్న చాలా టెన్షన్‌ పడ్డారు. ఓడిపోతే జలయజ్ఞం పరిస్థితి ఏమిటని బాధపడ్డారు. రెండోసారి గెలవడమే ఆయన పని తీరుకు నిదర్శనం. మంచి పథకాలు పెట్టినా, ప్రజలను ప్రేమించినా భారీ ఆధిక్యం ఎందుకు రాలేదని అడిగా. చిరునవ్వుతో పర్వాలేదులే పాప్స్‌ అన్నారు. నాన్న మరణాన్ని తట్టుకోలేక 700 మంది చనిపోయారు. ఆ రోజు నాకు అర్థమైంది. నాన్నను ప్రజలు ఎంత ప్రేమించారో అని. నాన్న లేకుండా నేను ఎలా బతికి ఉన్నానా అనుకున్నా’ అని షర్మిల వివరించారు.


రాహుల్‌ను ప్రధానిని చేయడమే వైఎస్‌కు నిజమైన నివాళి

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

‘రాహుల్‌ను ప్రధానిని చేయడమే వైఎస్సార్‌కు మనం అర్పించే నిజమైన నివాళి’ అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ‘తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా నేను పని చేస్తున్నానంటే... వైఎస్సార్‌ నాకు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా టికెట్‌ ఇచ్చి రాజకీయ ఓనమాలు నేర్పించడం వల్లే’ అని గుర్తు చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని