Himachal Pradesh: హిమాచల్‌లో హోరాహోరీ.. ఎమ్మెల్యేల తరలింపు యోచనలో కాంగ్రెస్‌..!

హిమాచల్‌ప్రదేశ్‌(Himachal Pradesh) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ఫలితాల వేళ రిసార్టు రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. ఫలితాల్లో స్వల్ప ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్‌ (Congress) ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Published : 08 Dec 2022 10:00 IST

శిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌(Himachal Pradesh) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ఓట్ల లెక్కింపు గురువారం కొనసాగుతోంది. ఈ ఫలితాల్లో భాజపా (BJP), కాంగ్రెస్‌(Congress) మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్‌ 34, భాజపా 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్న హస్తం పార్టీ వ్యూహాలు మొదలుపెట్టింది. భాజపా ‘ఆపరేషన్‌ కమలం’ ప్రయత్నాలను అడ్డుకునేందుకు కొత్త ఎమ్మెల్యేలను తరలించాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ఈ ఫలితాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గురువారం సాయంత్రానికి బస్సుల్లో రాజస్థాన్‌ తరలించేందుకు హస్తం పార్టీ ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎమ్మెల్యేల తరలింపు బాధ్యతను ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్‌, పార్టీ సీనియర్‌ నేత భూపిందర్‌ సింగ్‌ హుడాకు అప్పగించినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. హిమాచల్‌ పరిస్థితులను ఐఏసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పర్యవేక్షిస్తున్నారు. ఈ మధ్యాహ్నానికి ఆమె శిమ్లా చేరుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.

హిమాచల్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 35 మంది సభ్యుల సంఖ్యా బలం అవసరం. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో భాజపా, కాంగ్రెస్‌ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్నాయి. ఇక, ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆశపడిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇప్పటి వరకూ ఖాతా తెరవకపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని