Modi: నన్ను తిట్టడానికి కాంగ్రెస్‌లో పోటీ ఉంది.. ‘రావణ్‌’ వ్యాఖ్యలపై మోదీ సెటైర్‌

ప్రధాని మోదీకి రావణుడిలా 100 తలలు ఉన్నాయా? అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తాజాగా ప్రధాని స్పందిస్తూ.. హస్తం పార్టీకి గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

Updated : 01 Dec 2022 14:49 IST

అహ్మదాబాద్‌: తనను ‘రావణుడి’తో పోలుస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే చేసిన వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ గట్టిగా తిప్పికొట్టారు. తనను దూషించడానికి కాంగ్రెస్‌ పార్టీలో పోటీ నెలకొందని అన్నారు. మోదీని అవమానించడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తన హక్కుగా భావిస్తోందని ప్రధాని దుయ్యబట్టారు. ఖర్గే అంటే తనకు గౌరవం ఉందని.. అయితే ఆయన కాంగ్రెస్‌ హైకమాండ్‌(గాంధీ కుటుంబాన్ని ఉద్దేశిస్తూ) ఆదేశాలను పాటించక తప్పదంటూ ఎద్దేవా చేశారు. కొందరు ఆయనతో బలవంతంగా ఆ వ్యాఖ్యలు చేయించారని విమర్శించారు.

పంచమహల్‌ జిల్లాలోని కలోల్‌ పట్టణంలో ప్రధాని మోదీ గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హస్తం పార్టీ విమర్శలకు మోదీ దీటుగా బదులిచ్చారు. ‘‘కాంగ్రెస్‌లో కొందరు నేతలు నన్ను రావణుడన్నారు. మరికొందరు రాక్షసుడని తిట్టారు. ‘స్థాయి ఏంటో చూపిస్తామని’ అవమానించారు. ఇవన్నీ నాకేం కొత్త కాదు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అలాంటి మాటలు ఉపయోగించిన తర్వాత కాంగ్రెస్‌లో ఏ మాత్రం పశ్చాత్తాపం అనేదే ఉండదు. కనీసం క్షమాపణ చెప్పరు సరికదా.. మోదీని అవమానించడాన్ని కాంగ్రెస్‌ తమ హక్కుగా భావిస్తుంది. మోదీని ఎవరు ఎంత బాగా తిడతారు అనే దానిపై కాంగ్రెస్‌ నేతల మధ్య పోటీ నెలకొంది. రాముడు ఉన్నాడంటే విశ్వసించని వారు.. ఈ రోజు నన్ను ‘రావణుడు’ అంటూ తిట్టారు. గుజరాత్ రామభక్తుల రాష్ట్రమని కాంగ్రెస్‌కు తెలియదనుకుంటా..! ’’ అని ప్రధాని విమర్శించారు.

ఇటీవల గుజరాత్‌లోని ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఖర్గే.. మోదీపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ‘‘మోదీజీ ప్రధానమంత్రి. తన పని మర్చిపోయి.. కార్పొరేషన్‌ ఎన్నికలు, అసెంబ్లీ, లోక్‌సభ.. ఇలా ప్రతిచోటా ప్రచారం చేస్తున్నారు. నన్నే చూసి ఓటేయండి.. ఇంకెవరినీ చూడనవసరంలేదని అంటున్నారు. మోదీజీ మీ ముఖాన్ని మేం ఎన్నిసార్లు చూడాలి? మీకు ఎన్ని రూపాలు ఉన్నాయి? రావణుడిలా మీకేమైనా 100 తలలు ఉన్నాయా?’’ అని అన్నారు. ఖర్గే వ్యాఖ్యలను భాజపా నేతలు తీవ్రంగా ఖండించారు.

ఇక, గుజరాత్‌లో తొలి విడత పోలింగ్ గురువారం కొనసాగుతోంది. 19 జిల్లాల పరిధిలోని 89 నియోజకవర్గాలకు నేడు ఓటింగ్‌ జరుగుతోంది. మిగతా 93 నియోజకవర్గాలకు డిసెంబరు 5న రెండో విడతలో పోలింగ్‌ నిర్వహించనున్నారు. డిసెంబరు 8వ తేదీన ఫలితాలను వెల్లడికానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని