Kurnool: నా హత్యకు కుట్ర.. కాటసానిపై తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు

పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఆయన కుమారుడు శివనర్సింహారెడ్డితో పాటు తన గ్రామానికి చెందిన జి.కె.వెంగళరెడ్డి, గుర్రాల చెన్నారెడ్డి, లోటర్‌ బాషా తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌.. ఎస్పీ కృష్ణకాంత్‌కు ఫిర్యాదుచేశారు.

Updated : 07 Jul 2024 07:59 IST

కర్నూలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదుపత్రాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మల్లెల రాజశేఖర్‌

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఆయన కుమారుడు శివనర్సింహారెడ్డితో పాటు తన గ్రామానికి చెందిన జి.కె.వెంగళరెడ్డి, గుర్రాల చెన్నారెడ్డి, లోటర్‌ బాషా తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌.. ఎస్పీ కృష్ణకాంత్‌కు ఫిర్యాదుచేశారు. వారిపై కేసులు నమోదుచేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం హుసేనాపురానికి చెందిన మల్లెల రాజశేఖర్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి శనివారం పోలీసు కార్యాలయంలో ఎస్పీని కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోవడాన్ని కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఆయన కుమారుడు శివనర్సింహారెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని రాజశేఖర్‌ చెప్పారు. యువగళం పాదయాత్ర సమయంలో లోకేశ్‌ను విమర్శిస్తూ కాటసాని రాంభూపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తాను స్పందించానన్నారు. లోకేశ్‌ను దూషిస్తే నాలుక కోస్తానని ప్రకటన ఇచ్చానని.. అప్పటి నుంచి కాటసాని తనపై ద్వేషం పెంచుకున్నారన్నారు. అంతేగాక పాణ్యం తెదేపా అభ్యర్థి గౌరు చరితారెడ్డి విజయానికి కృషి చేయడాన్ని ఓర్వలేక కుట్రలు చేస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని