Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్షోభం.. రంగంలోకి దిగ్విజయ్‌

తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడింది. సమస్య పరిష్కారానికి ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ను ఆ పార్టీ అధిష్ఠానం రంగంలోకి దించింది.

Updated : 20 Dec 2022 14:17 IST

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడింది. సమస్య పరిష్కారానికి ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ను ఆ పార్టీ అధిష్ఠానం రంగంలోకి దించింది. దీంతో సమస్య పరిష్కారానికి ముఖ్యనేతలతో మాట్లాడారు. సీనియర్లకు సంబంధించిన సమస్యలపై కూర్చొని చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు.

ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఆయన ఫోన్‌ చేసి అధిష్ఠానం చేసిన సూచనలను తెలిపారు. దిగ్విజయ్‌ సూచనతో సీనియర్లు వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఆయన స్పందనను స్వాగతిస్తున్నామని మహేశ్వర్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు రెండు రోజుల్లో దిగ్విజయ్‌ రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం. 

మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఫోన్‌ చేశారు. సీనియర్ల సమస్యలు పరిష్కరిస్తామని.. సమస్యను జఠిలం చేయొద్దని సూచించారు. సమస్యలపై దిగ్విజయ్‌సింగ్‌తో చర్చించాలని ఆయన సూచించారు. ఎన్నికల సమయంలో గొడవలొద్దని.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని భట్టికి ఖర్గే సర్దిచెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు