Congress: పీసీసీ కమిటీల చిచ్చు.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఒరిజినల్‌ x వలస

తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ కమిటీల ప్రకటనపై సీనియర్‌ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎప్పటినుంచో పార్టీలో పనిచేస్తూ కాంగ్రెస్‌ను కాపాడుతున్న తమకు అన్యాయం చేసి.. వలస వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారని కట్టబెట్టారని ఆరోపించారు.

Updated : 24 Mar 2023 15:36 IST

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ కమిటీల ప్రకటన రగిల్చిన చిచ్చు తారస్థాయికి చేరింది. ఇప్పటికే పలువురు సీనియర్‌ నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో సీనియర్లు సమావేశమై చర్చించారు. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్‌ నేతలు దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కోదండరెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు తదితరులు హాజరయ్యారు.  అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ ఒరిజినల్‌ కాంగ్రెస్‌ నేతలకు అన్యాయం చేసి వలస వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను కాపాడుతున్న తమపై కోవర్టులు అంటూ సోషల్‌ మీడియాలో ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఏఐసీసీకి నివేదిస్తామని తెలిపారు.

తీవ్ర మనస్తాపానికి గురవుతున్నా: భట్టి

పీసీసీ కమిటీల కూర్పులో తాను పాలుపంచుకోలేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అందుకే తనను కలిసేవారికి న్యాయం చేయలేకపోతున్నట్లు చెప్పారు. ఈ విషయంలో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీని రక్షించుకునేందుకు చొరవ చూపాల్సి ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి మూల స్తంభాలుగా ఉన్న నాయకులపై సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని.. ఇది ఏడాదిన్నరగా జరుగుతోందని ఆక్షేపించారు. దీని వెనుక ఏదో కుట్ర జరుగుతోందనే భావన కలుగుతోందని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

అధిష్ఠానాన్ని కలుస్తాం: ఉత్తమ్‌

‘సేవ్‌ కాంగ్రెస్‌’ నినాదంతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నామని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ‘‘నేను చాలాకాలం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నా ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. జిల్లా అధ్యక్షుల నియామకంలో కాంగ్రెస్‌ గెలిచే ప్రాంతాల్లో ఏకాభిప్రాయం రాలేదు. 33 జిల్లాల్లో 26 చోట్ల నియమించి 7 చోట్ల ఆపడం సరికాదు. కమిటీల్లో ఎక్కువగా బయట నుంచి వచ్చిన వారికే స్థానం కల్పించారు. ఒరిజినల్‌ కాంగ్రెస్‌ నేతలకు అన్యాయం జరిగింది. ఈ విషయంపై త్వరలోనే మేమంతా అధిష్ఠానాన్ని కలుస్తాం. ఇక్కడి పరిస్థితులను తెలియజేస్తాం’’ అన్నారు.

ఇక్కడే ఉంటాం.. ఇక్కడే చస్తాం: దామోదర రాజనర్సింహ

కాంగ్రెస్‌లో ఉన్న ఒరిజినల్‌ నాయకులు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని దామోదర రాజనర్సింహ అన్నారు. మొదటి నుంచి ఉన్నవారిని కాపాడుకోవాలనేదే తమ ఆవేదన అని చెప్పారు. ఇతర పార్టీల నుంచి వచ్చినవారికే కమిటీల్లో ఎక్కువగా అవకాశం కల్పించారన్నారు. ‘‘మేం నాలుగు పార్టీలు మారి వచ్చిన వాళ్లం కాదు.. ఇక్కడే ఉంటాం.. ఇక్కడే చస్తాం’’ అని వ్యాఖ్యానించారు. 

కుట్రపూరితంగా పార్టీని నాశనం చేస్తున్నారు: మధుయాష్కీ

మాజీ ఎంపీ మధుయాష్కీ మాట్లాడుతూ.. ఇది కాంగ్రెస్‌ నాయకులకు, వలస వచ్చిన వారికి మధ్య జరుగుతున్న పోరాటమని వ్యాఖ్యానించారు. కమిటీల విషయంలో పీసీసీ అధ్యక్షుడితో సమానంగా ఉండే సీఎల్పీ నేతనే భాగస్వామ్యం చేయడం లేదని.. ఆయనకే అన్యాయం జరుగుతోందన్నారు. కుట్రపూరితంగా కాంగ్రెస్‌ను నాశనం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బయట నుంచి వచ్చిన వారికి తమను ప్రశ్నించే స్థాయి లేదన్నారు. అధికార పార్టీతో వ్యాపారం చేస్తూ తమకు నీతులు చెప్పడమేంటని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఉన్న నేతలంతా సుదీర్ఘకాలంగా పార్టీలో ఉన్నవాళ్లేనని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర విజయవంతం కోసం అందరం పనిచేశామన్నారు. అలాంటి తమను కోవర్టులుగా ముద్ర వేస్తారా? అని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని