Sachin Pilot: సచిన్‌ పైలట్ కొత్త పార్టీపై వస్తున్నవి రూమర్లే.. కాంగ్రెస్‌

సచిన్‌ పైలట్ కొత్త పార్టీని ప్రకటిస్తారంటూ వస్తోన్న వార్తలపై కాంగ్రెస్ మరోసారి స్పందించింది. అవన్నీ రూమర్లేనంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ కొట్టిపారేశారు.

Published : 09 Jun 2023 22:59 IST

దిల్లీ: కాంగ్రెస్‌ (Congress) అధిష్ఠానం సయోధ్యకు ప్రయత్నించినా రాజస్థాన్‌ కాంగ్రెస్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌(Ashok Gehlot), అసమ్మతి నేత సచిన్‌ పైలట్‌(Sachin pilot)ల మధ్య దూరం పెరుగుతోంది. త్వరలో ఎన్నికలు జరగనుండటంతో అక్కడి పరిణామాలు కాంగ్రెస్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో సచిన్‌ పైలట్‌ తన తండ్రి వర్ధంతి ఈ నెల 11న కొత్త పార్టీ ప్రకటిస్తారంటూ వస్తోన్న వార్తల్ని కాంగ్రెస్‌ పార్టీ మరోసారి కొట్టిపారేసింది. అవన్నీ కేవలం వదంతులేనని కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ అన్నారు. రాజస్థాన్‌లో పార్టీ ఐక్యంగానే ఉందని.. వచ్చే ఎన్నికలకు అంతా కలిసికట్టుగానే వెళ్తామని స్పష్టంచేశారు.

కేసీ వేణుగోపాల్‌ శుక్రవారం దిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఇలాంటి వదంతులను నేను నమ్మను. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇటీవల సీఎం అశోక్‌ గహ్లోత్‌, సచిన్‌ పైలట్‌లను పిలిచి మాట్లాడిన తర్వాత మేం కలిసి వెళ్తామని చెప్పారనేది వాస్తవం. కాంగ్రెస్‌ పరిస్థితి అది. కానీ వదంతులు వస్తున్నట్టుగా అలా జరగదు. ఇటీవల పైలట్‌ను కలిశాను. అలాంటిదేమీ ఉండదు’’ అని వ్యాఖ్యానించిన కేసీ వేణుగోపాల్.. వదంతులను నమ్మొద్దని మీడియాకు సూచించారు.  సచిన్‌ పైలట్‌ పార్టీ నుంచి బయటకు వెళ్తున్నట్లు ఎవరు చెప్పారు? అవన్నీ ఊహాజనితం.. వదంతులే. ఇలాంటి పుకార్లను నమ్మొద్దు. సానుకూల దృక్పథంతో ఉండాలని కోరుతున్నాం. రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ఐక్యంగా పోరాటం చేస్తుందని తెలిపారు.

ఇంకోవైపు, 2028 ఎన్నికల తర్వాత సీఎం పీఠం కోసం ఆశించి భంగపాటుకు గురైన పైలట్‌ ఆ తర్వాత మాజీ సీఎం, భాజపా నేత వసుంధర రాజే ప్రభుత్వంలో జరిగిన అవినీతి చర్యలు, ఉద్యోగ నియామక పరీక్ష పత్రాల లీకేజీ బాధ్యులను శిక్షించడం వంటి డిమాండ్లతో సొంత ప్రభుత్వంపైనే నిరసన గళం వినిపించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇటీవల పలు సమస్యలపై నిరసన దీక్ష కూడా చేశారు. ఈ వ్యవహారంతో వారిద్దరినీ పిలిపించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం వారితో చర్చించి సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నం చేసింది. ఆ తర్వాతే ఈ నెల 11న తన తండ్రి వర్ధంతి రోజున సచిన్‌ పైలట్‌ కొత్త పార్టీని ప్రకటిస్తారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని