Women Reservation: మహిళా రిజర్వేషన్‌ బిల్లు.. ఇదో ఎన్నికల జుమ్లానే : కాంగ్రెస్‌

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు (Women Reservation Bill) ఆమోదం లభించినా.. అది 2027లో అమలవుతుందని ప్రభుత్వం చెప్పడంపై కాంగ్రెస్‌ మండిపడింది.

Updated : 19 Sep 2023 18:21 IST

దిల్లీ: చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెంచేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లును (Women Reservation Bill) ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ సమావేశాల్లో దీనికి ఆమోదం తెలిపినా.. జనగణన, డీలిమిటేషన్‌ తర్వాతే ఈ రిజర్వేషన్లు అమలు కానున్నాయని ప్రభుత్వం తెలిపింది. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. ఇది కేవలం ఎన్నికల వాగ్దానంలో భాగమేనని.. మహిళల ఆశలకు ప్రభుత్వం ద్రోహం చేసినట్లేనని తెలిపింది.

‘మహిళా రిజర్వేషన్‌ బిల్లును తీసుకువచ్చిన క్రమాన్ని అర్థం చేసుకోవాలి. బిల్లు ఈరోజు ప్రవేశపెట్టినప్పటికీ.. దాని ప్రయోజనాలు మాత్రం దేశ మహిళలు ఇప్పుడే పొందలేరు. ఎందుకంటే.. జనగణన చేపట్టిన తర్వాతే ఇది అమల్లోకి వస్తుంది. కానీ, దీన్ని 2021లోనే చేపట్టాల్సి ఉండగా.. ఇప్పటికీ ప్రభుత్వం చేపట్టలేదు. ఎప్పుడు చేస్తారో తెలియదు. 2027 లేదా 2028లో చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంటే.. ఎన్నికల ముందు ప్రధాని మోదీ మరో జుమ్లాని తీసుకువచ్చారు’ అని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది.

డీలిమిటేషన్‌ తర్వాతే మహిళా రిజర్వేషన్లు..!

‘ఎన్నికల వాగ్దానాల సీజన్‌లో.. వాటన్నింటిలో ఇది అతిపెద్దది. కోట్ల మంది మహిళల ఆశలకు ద్రోహం చేసినట్లే. మేం ముందునుంచి చెబుతున్నట్లుగా జీ20లో కేవలం భారత్‌ మాత్రమే జనగణన చేపట్టడంలో విఫలమైంది. మహిళా బిల్లు చట్టంగా మారిన తర్వాత చేపట్టే జనగణన, అనంతరం డీలిమిటేషన్‌ ఆధారంగా రిజర్వేషన్లు అమలవుతాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ జనగణన ఎప్పుడు చేపడుతారు..? అమలు ఎప్పుడు అవుతుందో తెలియని ఈ బిల్లుపై ప్రభుత్వం ఎంతో ఆర్భాటం చేస్తోంది. ఇదో రకమైన ఈవీఎం (ఈవెంట్‌ మేనేజిమెంట్‌)’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ పేర్కొన్నారు.

అంతకుముందు ఇదే విషయంపై మాట్లాడిన జైరాం రమేశ్‌.. మహిళలకు రిజర్వేషన్లను అమలు చేయాలనేది కాంగ్రెస్‌ చిరకాల ఆశయమన్నారు. కేంద్ర కేబినెట్‌ నిర్ణయాన్ని పార్టీ స్వాగతిస్తోందన్న ఆయన.. రహస్యంగా కాకుండా అఖిలపక్ష సమావేశంలో చర్చించి ఏకాభిప్రాయం సాధించి ఉంటే బాగుండేదన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు