AAP vs Congress: ‘ఆమ్‌ఆద్మీ’తోనే కాంగ్రెస్‌కు ముప్పు..?

వరుస పరాజయాలతో ‘ఐసీయూ’లో చేరిన కాంగ్రెస్‌కు అత్యవరస చికిత్స చేయకపోతే 2024 సార్వత్రిక ఎన్నికలకు మార్గం మరింత కష్టతరమే అవుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Published : 12 Mar 2022 01:25 IST

తాజా ఫలితాలపై విశ్లేషకుల అభిప్రాయం

దిల్లీ: సొంత పార్టీలోనే అసమ్మతి (జీ-23) నేతల తీరుతో సతమతమవుతోన్న కాంగ్రెస్‌కు, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలనే ఆమ్‌ఆద్మీ లక్ష్యంగా చేసుకోవడం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత చరిత్ర కలిగిన కాంగ్రెస్‌కు రెండు సవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అస్తిత్వ సంక్షోభం ఒకటైతే, అధికారంలో ఉన్న రాష్ట్రాలను కాపాడుకోవడం రెండోది. ఈ తరుణంలో ఇప్పటికే వరుస ఓటములతో కుదేలవుతోన్న కాంగ్రెస్‌కు ఓవైపు ఆమ్‌ఆద్మీ, మరోవైపు తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి ముప్పు పొంచివున్నట్లు అర్థమవుతోంది. వరుస పరాజయాలతో ‘ఐసీయూ’లో చేరిన కాంగ్రెస్‌కు అత్యవసర చికిత్స చేయకపోతే 2024 సార్వత్రిక ఎన్నికలు ఆ పార్టీకి మరింత కష్టతరమేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఆత్మపరిశీలన తప్పదు..

‘పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ సాధించిన ఘన విజయం నిజంగా హర్షించదగినదే. అయితే, కాంగ్రెస్‌ పార్టీకి ఆమ్‌ఆద్మీ సవాలుగా మారుతుందా? లేదా అనే విషయాన్ని ఆ పార్టీనే ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇదే సమయంలో భాజపాకు వ్యతిరేక పక్షాన్ని మాత్రం మరింత శక్తిమంతం చేయాలి’ అని శివసేన నేత, రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు. భాజపాకు వ్యతిరేకంగా గళం విప్పినందునే ఆమ్‌ఆద్మీపార్టీ పంజాబ్‌లో విజయం సాధించిందన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించే బలమైన ప్రతిపక్షాల వైపు ప్రజలు చూస్తున్నట్లు పంజాబ్‌ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని ప్రియాంక చతుర్వేది అన్నారు.

ఆమ్‌ఆద్మీతోనే ముప్పు..

ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి అతిపెద్ద ముప్పు ఆమ్‌ఆద్మీ అయ్యే అవకాశాలు క్రమంగా పెరుగుతున్నాయని సామాజికాభివృద్ధి పరిశోధనా కేంద్ర ‘లోక్‌నీతి’ సహ వ్యవస్థాపకుడు సంజయ్‌ కుమార్‌ వెల్లడించారు. ముఖ్యంగా ఆమ్‌ఆద్మీ పాగా వేస్తోన్న రాష్ట్రాలపై కాంగ్రెస్‌ పార్టీ మరింత దృష్టి సారించాలన్నారు. ఇప్పటికే దిల్లీ, పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ అడుగుపెట్టిన తీరు కాంగ్రెస్‌ పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించిన విషయాన్ని గుర్తుచేశారు. వివిధ రాష్ట్రాల్లో ఈ ముప్పును ముందుగానే భావించి ముందుకెళ్లాలన్న ఆయన.. వారి తదుపరి లక్ష్యం గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్ అని చెప్పుకొచ్చారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ అస్తిత్వ సంక్షోభంలో ఉందా? లేదా అనే విషయం ఆ పార్టీనే ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి అన్ని విధాలా సరైన చికిత్స అందించకుంటే ఆమ్‌ఆద్మీ నుంచి ముప్పు ఉన్నట్లేనని సంజయ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

అస్తిత్వ సంక్షోభమే..

ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి అసలైన ముప్పు ఆమ్‌ఆద్మీ నుంచే అని ‘24, అక్బర్‌ రోడ్‌’, ‘సోనియా: ఏ బయోగ్రఫీ’ పుస్తక రచయిత రషీద్‌ కిద్వాయ్‌ పేర్కొన్నారు. అయితే, ఈ ముప్పు ఎంత పెద్దదనే విషయం రాష్ట్రానికి, రాష్ట్రానికి మారుతుందన్నారు. ఉదాహరణకు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తస్‌గఢ్‌లో ఆమ్‌ఆద్మీ చెప్పుకోదగిన విధంగా పుంజుకోకున్నప్పటికీ కాంగ్రెస్‌ అసంతృప్తి నేతలందరికీ అదో వేదికగా మారుతుందని అన్నారు. ఇలా ప్రతిపక్ష పార్టీగా ఆమ్‌ఆద్మీకి ఆదరణ పెరిగే క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీ అస్తిత్వ సంక్షోభంలో మునిగిపోవచ్చని రషీద్‌ కిద్వాయ్‌ అంచనా వేశారు.

మార్పునకు సరైన సమయమిదే..

కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా బలాన్ని పుంజుకోవడమో లేదా బలంగా ఉన్న విపక్షపార్టీకి మద్దతు ఇవ్వడంతోనో ఎన్నికల్లో ప్రయోజనం పొందవచ్చని మరో సీనియర్‌ నేత పేర్కొన్నారు. ఇందుకు గోవా ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లిన వైనాన్ని ప్రస్తావించిన ఆయన.. ఇతర పార్టీలతో కలవకపోవడం వల్ల ఓట్లు విడిపోయిన విషయం స్పష్టంగా కనిపించిందన్నారు. తాజా ఎన్నికల ఫలితాలు పార్టీ నేతలందర్నీ ఎంతగానో నిరాశకు గురిచేశాయన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌.. పార్టీలో సంస్థాగత సంస్కరణలకు ఇదే సరైన సమయమనే విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా విజయం సాధించాలంటే మార్పు అనేది అనివార్యమనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని