Modi: సొంత ఎమ్మెల్యేలనే సీఎం నమ్మట్లేదు..: కాంగ్రెస్‌ కుమ్ములాటపై మోదీ చురకలు

మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. దీనిపై ప్రధాని మోదీ (Modi) స్పందిస్తూ.. సీఎం అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.

Updated : 10 May 2023 16:42 IST

జైపుర్‌: భాజపా నాయకురాలు, మాజీ సీఎం వసుంధర రాజెను ప్రశంసిస్తూ రాజస్థాన్‌ (Rajasthan) ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot) చేసిన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌ (Congress)లో మరోసారి అంతర్గత కుమ్ములాటకు దారితీశాయి. ఆ వ్యాఖ్యలకు గానూ కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ (Sachin Pilot).. గహ్లోత్‌ను బహిరంగంగానే నిలదీశారు. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామాలపై స్పందించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi).. హస్తం పార్టీకి చురకలంటించారు. ప్రస్తుతం రాజస్థాన్‌ పర్యటనలో ఉన్న ప్రధాని.. గహ్లోత్‌ సర్కారును ఎండగట్టారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే సీఎంకు విశ్వాసం లేదంటూ ఎద్దేవా చేశారు.

పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు గానూ ప్రధాని మోదీ (PM Modi) బుధవారం రాజస్థాన్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వంలోని అందరూ ఒకరినొకరు అవమానించుకోవడంలో పోటీపడుతున్నారు. గత ఐదేళ్లుగా ఆ కుర్చీ(సీఎం పదవి) సమస్యల్లో ఉన్నప్పుడు.. రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించేదెవరు? ముఖ్యమంత్రి (Ashok Gehlot) తన సొంత ఎమ్మెల్యేలనే విశ్వసించట్లేదు. అందుకే వారు కూడా ఆయనను నమ్మట్లేదు’’ అని మోదీ (PM Modi) విమర్శించారు.

ఇక, 2008 నాటి జైపుర్ వరుస పేలుళ్ల కేసులో నిందితులను రాజస్థాన్‌ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించడాన్ని మోదీ ప్రస్తావిస్తూ.. ‘‘ఆ కేసులో కాంగ్రెస్‌ ప్రభుత్వం గట్టిగా పోరాడలేదు. అందుకే వారంతా నిర్దోషులుగా బయటికొచ్చారు. ఉగ్రవాదంపై ఆ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఇక, కాంగ్రెస్‌ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. ఓటుబ్యాంకు రాజకీయాల కారణంగా.. నేరస్థులపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్‌ సర్కారు భయపడుతోంది’’ అని దుయ్యబట్టారు.

ప్రతిపక్షాలను గౌరవించాలి.. మోదీ ఎదుట గహ్లోత్‌ వ్యాఖ్యలు

అంతకుముందు నాథ్‌ద్వారా ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో సీఎం అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot) కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ఎదుటే గహ్లోత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రతిపక్షాలకు గౌరవం ఇవ్వాలి. ప్రధాని కూడా అదే విధానాన్ని పాటిస్తారని అనుకుంటున్నా. అలా జరిగినప్పుడే.. అధికారం, ప్రతిపక్షం కలిసి దేశాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశం లభిస్తుంది. నేతలు ఐక్యంగా ఉంటే దేశం కూడా ఐకమత్యంగా ఉంటుంది’’ అని గహ్లోత్‌ అన్నారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటలకే ప్రధాని మోదీ.. కాంగ్రెస్‌లో లుకలుకలను ఎద్దేవా చేస్తూ సీఎంకు కౌంటర్‌ ఇవ్వడం గమనార్హం.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని