Published : 23 Apr 2022 01:43 IST

Congress: దమ్ముంటే.. ఆ సంస్థల్ని నిషేధించండి: సిద్ధరామయ్య ఛాలెంజ్‌!

హుబ్బళ్లి: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య కర్ణాటకలోని భాజపా ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. ఎస్‌డీపీఐ, ఏఐఎంఐఎం, ఆర్‌ఎస్‌ఎస్‌, భజరంగ్‌దళ్‌ వంటి సంస్థలు సమాజంలో శాంతిని దెబ్బతీస్తున్నాయని ఆరోపించిన ఆయన.. ధైర్యం ఉంటే ఆయా సంస్థలపై నిషేధం ప్రకటించాలన్నారు. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. హుబ్బళ్లిలో ఇటీవల చెలరేగిన హింస నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని సంస్థల్ని నిషేధించాలని యోచిస్తోందన్న ప్రశ్నకు సిద్ధరామయ్య స్పందించారు. ‘‘మీకు దమ్ముండి సమాజంలో శాంతికి విఘాతం కలిగించే సంస్థలను నిషేధిస్తే ఎవరు వద్దంటారు? ఎస్‌డీపీఐ, ఏఐఎంఐఎం, ఆర్‌ఎస్‌ఎస్‌, భజరంగ్‌ దళ్‌ లాంటి సంస్థలైనా.. నిషేధించండి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’’ అని వ్యాఖ్యానించారు.

ఇటీవల హుబ్బళ్లిలో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో అనేక అదృశ్య శక్తుల హస్తం ఉందనీ.. కొన్ని సంస్థలు కూడా దీని వెనుక ఉన్నాయంటూ కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర నిన్న సామాజిక మాధ్యమాల వేదికగా పేర్కొన్నారు. అలాంటి సంస్థల కార్యకలాపాల్ని నియంత్రించేందుకు వాటిని నిషేధించేలా తమ ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. దీనిపై మీడియా ప్రతినిధులు సిద్ధరామయ్యను ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు. అలాగే, హబ్బళ్లిలో చెలరేగిన హింసను ఆయన ఖండించారు. దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. హోంమంత్రి బాధ్యతరహితంగా వ్యవహరిస్తున్నారనీ.. ఆయన ఆ పదవికి అనర్హుడని మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని