Karnataka: ప్రతి గృహిణికి నెలకు రూ.2వేలు.. కాంగ్రెస్‌ హామీ

కర్ణాటక(Karnataka) అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్‌ (Congress) వ్యూహాలకు పదునుపెడుతోంది. ఓటర్లను ఆకర్షించేందుకు హామీలు కురిపిస్తోంది.

Published : 17 Jan 2023 01:39 IST

బెంగళూరు: కర్ణాటక (Karnataka)లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికల విజయంతో విశ్వాసం పెంచుకున్న కాంగ్రెస్‌ (Congress) పార్టీ.. కర్ణాటకలోనూ అధికారాన్ని చేపట్టేందుకు వ్యూహాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఓటర్లను ఆకర్షించేందుకు అనేక వాగ్దానాలు ఇస్తోంది. తాజాగా మహిళలను ఆకట్టుకునేందుకు ‘గృహలక్ష్మి’ పథకం ప్రకటించింది. తమను గెలిపిస్తే గృహిణులకు నెలకు రూ.2000 నగదు అందిస్తామని హామీ ఇచ్చింది.

ప్రస్తుతం కర్ణాటక పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra).. సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోనే ఆమె గృహలక్ష్మి పథకాన్ని ఆవిష్కరించారు. ఈ పథకం కిందే ఏడాదికి రూ.24వేలు నేరుగా గృహిణుల ఖాతాలోనే జమ చేస్తామని హామీ ఇచ్చారు. ‘‘వంటగ్యాస్‌, నిత్యావసరాల ధరల మోతతో గృహిణుల ఖర్చులు పెరుగుతున్నాయి. వారి కోసమే గృహలక్ష్మి యోజన పథకం తీసుకొచ్చాం. కర్ణాటకలో ప్రతి మహిళ తన కాళ్లపై తాను నిలబడి.. తన పిల్లలను సంరక్షించుకోవాలని మేం కోరుకుంటున్నాం. అందుకే వారికి ఆర్థికసాయం అందజేయాలనుకుంటున్నాం’’ అని కాంగ్రెస్‌ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పథకంతో రాష్ట్రంలోని కోటిన్నర మంది మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని పార్టీ వెల్లడించింది.

ఇప్పటికే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉచిత విద్యుత్‌ హామీని హస్తం పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే.. ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్ల కరెంట్‌ను ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చింది. గృహ జ్యోతి యోజన పేరుతో గతవారం ఈ తొలి హామీని ప్రకటించిన కాంగ్రెస్ (Congress).. ఇప్పుడు రెండో హామీగా గృహలక్ష్మి పథకాన్ని ప్రకటించింది.

ఇటీవల హిమాచల్‌ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంలో ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించారు. అధ్యక్షుడు ఖర్గేతో కలిసి పార్టీ ప్రచార బాధ్యతలను నిర్వహించిన ఆమె.. అనేక వ్యూహరచనలు చేయడంతో పాటు విరివిగా ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో బాధ్యతల్లో ప్రియాంకకు అదే తొలి విజయం. దీంతో రాబోయే కర్ణాటక ఎన్నికల్లో ఆమె కీలకంగా మారారు. ఈ క్రమంలోనే ఆమె తాజాగా రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌-మే నెలల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని