Karnataka Elections: రాహుల్ చెప్పినట్లే.. కుమారుడి స్థానం నుంచి సిద్ధరామయ్య పోటీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Assembly Elections) కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల చేసింది. అగ్రనేత రాహుల్‌ గాంధీ సూచన మేరకు మాజీ సీఎం సిద్ధరామయ్య వరుణ నుంచే పోటీ చేస్తున్నారు.

Updated : 25 Mar 2023 10:10 IST

కర్ణాటకలో కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Assembly Elections) గడువు దగ్గరపడుతున్న వేళ.. రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. తాజాగా రాష్ట్రంలో ప్రధాన విపక్షమైన కాంగ్రెస్‌ (Congress) పార్టీ.. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. అందరూ ఊహించినట్లుగానే హస్తం పార్టీ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఈ సారి కోలార్‌ స్థానం నుంచి కాకుండా వరుణ నియోజకవర్గం (Varuna seat) నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇందుకోసం ఆయన కుమారుడు యతీంద్ర తన సీటును త్యాగం చేశారు.

రాహుల్‌ గాంధీ సలహా మేరకు..

సిద్ధరామయ్య (Siddaramaiah) గతంలో చాముండేశ్వరి, వరుణ నియోజకవర్గాల్లో అనేకసార్లు విజయం సాధించారు. అయితే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కుమారుడు యతీంద్ర కోసం వరుణ నియోజకవర్గాన్ని త్యాగం చేసిన సిద్ధరామయ్య.. బదామీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన కోలారు నుంచి పోటీ చేయాలని భావించారు. దీనిపై అధిష్ఠానంతో మంతనాలు కూడా జరిపారు. కాగా.. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi).. కోలారు నుంచి పోటీ వద్దని సిద్ధుకు సూచించారు. ఈ నేపథ్యంలోనే వరుణ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న యతీంద్ర కూడా తండ్రి కోసం తన స్థానాన్ని త్యాగం చేసేందుకు సిద్ధపడ్డారు. ఫలితంగా సిద్ధరామయ్య (Siddaramaiah) వరుణ నుంచి బరిలోకి దిగారు. ఈ మేరకు నేటి జాబితాలో వరుణ అభ్యర్థిగా ఈ మాజీ సీఎం పేరును కాంగ్రెస్‌ (Congress) ప్రకటించింది.

యతీంద్రకు ఎంపీ టికెట్‌..?

వచ్చే ఎన్నికల్లో యతీంద్ర ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఇంకా స్పష్టత రాలేదు. తాజా జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బరిలోకి దిగకపోవచ్చని సమాచారం. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో యతీంద్రకు ఎంపీ టికెట్‌ ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.

124 మందితో తొలి జాబితా..

ఇక, అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ (Congress) 124 మందితో తొలి జాబితాను శనివారం విడుదల చేసింది. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ చీఫ్‌ డీకే శివకుమార్‌ (DK Shivakumar).. కనకపుర స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే కుమారుడు ప్రియాంక్‌ ఖర్గే.. చీతాపూర్‌ నుంచి, మాజీ ఉపముఖ్యమంత్రి జి. పరమేశ్వర కోరటగెరె స్థానం నుంచి బరిలోకి దిగుతున్నట్లు పార్టీ ప్రకటించింది.

కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Assembly Elections) ఈసీ ఇంకా షెడ్యూల్‌ ప్రకటించలేదు. ఈ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తొలి పార్టీ కాంగ్రెస్సే. ఈ ఏడాది మే నెలతో ప్రస్తుత శాసనసభ గడువు ముగియనుంది. ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే అవకాశముంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని