Parliament sessions: మూడో రోజూ అదే తీరు.. కాంగ్రెస్‌పై పీయూష్‌ గోయల్‌ ఫైర్‌

కొన్ని వస్తువులపై జీఎస్టీ బాదుడు, నిత్యావసరాల ధరల పెరుగుదలపై పార్లమెంటులో విపక్షాల నిరసనల హోరు మూడో రోజూ .....

Published : 20 Jul 2022 22:27 IST

(రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీల నిరసన)

దిల్లీ: కొన్ని వస్తువులపై జీఎస్టీ బాదుడు, నిత్యావసరాల ధరల పెరుగుదలపై పార్లమెంటులో విపక్షాల నిరసనల హోరు మూడో రోజూ కొనసాగింది. సామాన్యుడి నడ్డి విరిచేలా భారం పెంచుతున్నారంటూ విపక్ష పార్టీలు ఉభయ సభల్లో కార్యకలాపాలను స్తంభింపజేశాయి. సభాకార్యకలాపాలకు అడ్డుతగలడంతో ఉభయ సభలూ గురువారానికి వాయిదా పడ్డాయి. అయితే, పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ తీరుపట్ల కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సభాకార్యకలాపాలకు అడ్డు తగులుతూ.. ప్రజాస్వామ్యం పట్ల కాంగ్రెస్ పార్టీ విధ్వంసకర వైఖరిని అనుసరిస్తోందన్నారు. సభ జరగనీయకుండా చేయడంలో కాంగ్రెస్‌ విజయం సాధించిందంటూ ఎంపీ జైరాం రమేశ్ చేసిన ట్వీట్‌తోనే ఆ విషయం అర్థమైపోయిందంటూ ధ్వజమెత్తారు. 

ధరల పెరుగుదల, జీఎస్టీ, ఇతర అంశాలపై చర్చ నుంచి ప్రభుత్వం పారిపోవడంలేదని, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ కొవిడ్‌ నుంచి కోలుకొని వచ్చాక ఈ అంశాలపై చర్చ చేపడతామన్నారు. సభాకార్యకలాపాలను అడ్డుకోవడంలో విపక్షాలు పోటీ పడుతున్నాయంటూ పీయూష్‌ ఎద్దేవా చేశారు. మరోవైపు, ధరల పెరుగుదల, కొన్ని నిత్యావసరాలపై జీఎస్టీ విధించిన అంశంపై తక్షణమే చర్చ చేపట్టాలని, కొన్ని వస్తువులపై విధించిన జీఎస్టీని ఉపసంహరించుకోవాలంటూ విపక్షాలు చేస్తోన్న డిమాండ్‌కు ఆయన కౌంటర్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు కూడా జీఎస్టీ కౌన్సిల్లో ఉన్నాయని.. జీఎస్టీ పెంపు నిర్ణయానికి వారూ అంగీకరించారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని