‘మరి ఈ ఐదేళ్లు ఏం చేశారు?’.. భాజపా ఉమ్మడి పౌరస్మృతి హామీపై కాంగ్రెస్‌

హిమాచల్‌ప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామంటూ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. ఇది ఎన్నికల జిమ్మిక్‌ అని దుయ్యబట్టింది.

Published : 07 Nov 2022 01:49 IST

దిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామంటూ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. ఇది ఎన్నికల జిమ్మిక్కేనంటూ దుయ్యబట్టింది. ఎన్నికల ముందే ఇలాంటి హామీలు ఆ పార్టీకి గుర్తొస్తాయని విమర్శించింది. హిమాచల్‌లో అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామంటూ భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా హామీ ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ మను సింఘ్వీ స్పందించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో దీనిపై మాట్లాడారు.

‘‘నడ్డా పార్టీ (BJP) గత ఐదేళ్లుగా హిమాచల్‌ ప్రదేశ్‌లో అధికారంలో ఉంది. ఎనిమిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉంది. అలాంటప్పుడు ఈ ఎనిమిదేళ్లలో ఎందుకు ఆ పనిచేయలేదు? కనీసం గడిచిన ఐదేళ్లలో ఈ పనెందుకు చేయలేదు?’’ అని సింఘ్వీ ప్రశ్నించారు. ఇది పక్కా ఎన్నికల జిమ్మిక్‌ అని విమర్శించారు. గెలిచే బలం లేదని తెలిసినప్పుడే మతం, ఇటువంటి హామీలు ఆ పార్టీకి గుర్తొస్తాయని దుయ్యబట్టారు. ఒకవేళ రాష్ట్రస్థాయిలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తే అది రాష్ట్రానికి రాష్ట్రానికి మారిపోతూ ఉంటుందని చెప్పారు. ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి హామీలు ఇస్తున్నారంటూ విమర్శించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో 68 స్థానాలకు నవంబర్‌ 12న పోలింగ్‌ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని