Rahul Gandhi: ఇంధన ధరల తగ్గింపు పేరుతో ప్రభుత్వం వంచన

పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కంటితుడుపు చర్యల్లో భాగమేనని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు.

Published : 23 May 2022 01:33 IST

భాజపాపై విరుచుకుపడ్డ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ

దిల్లీ: గత కొంతకాలంగా రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న పెట్రో ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వ నిర్ణయం కంటితుడుపు చర్యల్లో భాగమేనని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. భారీ స్థాయిలో తగ్గించామని పేర్కొంటూ భాజపా వంచనకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఇకనైనా ప్రజలను మోసం చేయడం ఆపాలని.. రికార్డు స్థాయిలో దూసుకెళ్తోన్న ద్రవ్యోల్బణం నుంచి ప్రజలకు నిజమైన ఉపశమనం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

మే 1, 2020, ప్రస్తుతం పెట్రోల్‌ ధరను పోలుస్తూ రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. ‘మే 1, 2020 న పెట్రోల్‌ ధర రూ.69.5గా ఉంది. మార్చి 1, 2022కి అది రూ.95.4కు పెరిగింది. మే 1 నాటికి రూ105.4కు చేరుకుంది. మళ్లీ మే 22నాటికి రూ. 96.50కి చేరింది. ప్రజలను మోసం చేయడం ఆపాలి. మండిపోతోన్న ధరల నుంచి వారికి నిజమైన ఉపశమనం కల్పించాలి’ అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఇక పెట్రోల్‌ ధరల తగ్గింపునపై మాట్లాడిన కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌.. రాజకీయ జిమ్మిక్కులపై అధిక శ్రద్ధ చూపుతోన్న మోదీ ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కల్పించడంలో మాత్రం వెనుకబడిపోయిందని విమర్శించారు. పెట్రోల్‌పై గడిచిన 60 రోజుల్లో రూ.10 పెంచి ఇప్పుడు రూ.9.5 తగ్గించడం కుతంత్రం కాదా? అని ప్రశ్నించారు. మరోవైపు గత 18 నెలల్లో ఎల్‌పీజీ ధర రూ.400 పెంచి ఇప్పుడు రూ.200 తగ్గించామని చెప్పడం దారుణమన్నారు. ఇలా ఇంధన ధరల పేరుతో ప్రజల రక్తాన్ని పీల్చడమేనని కేంద్ర ప్రభుత్వంపై దుయ్యబట్టారు.

ఇదిలాఉంటే, నిత్యం రికార్డు స్థాయిలో పెరిగిపోతోన్న పెట్రో ఉత్పత్తుల ధరల పరుగులకు కళ్లెం వేసే ప్రయత్నంలో భాగంగా లీటర్‌ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 మేర ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఆ రెండు ఇంధనాల ధర లీటర్‌కు వరుసగా రూ.9.50, రూ.7 వరకు దిగి వచ్చింది. ఎక్సైజ్‌ సుంకంలో కోత నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.లక్ష కోట్ల ఆదాయం కోల్పోనుందని పేర్కొంది. ఈ సమయంలో రాష్ట్రాలు కూడా పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని