Gehlot Vs Sachin: ఆధిపత్య పోరు మళ్లీ షురూ.. తన పనితీరు వల్లే గెలిచామన్న గహ్లోత్‌

రాజస్థాన్‌ పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం అయ్యిందని సచిన్‌ పైలట్‌ చేసిన వ్యాఖ్యలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పరోక్షంగా ఖండించారు. తాను  గతంలో చేసిన అభివృద్ధి వల్లే 2018లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు. 

Published : 27 Jan 2023 01:24 IST

జైపుర్‌: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో వర్గపోరు మరింత ముదురుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot), మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ (Sachin Pilot)ల మధ్య ఆధిపత్య పోరు మరోసారి తెరపైకి వచ్చింది. తాను 2013-2018 మధ్యకాలంలో పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు పార్టీ నాయకుల కృషి వల్లే క్రితం ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లు సచిన్‌ పైలట్‌ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఖండించారు. తాను గతంలో చేసిన అభివృద్ధి వల్లే 2018లో కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 156 స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.

2013లో ఎమ్మెల్యేల సంఖ్య 21గా ఉండగా.. పార్టీ హైకమాండ్‌ తనను పీసీసీ చీఫ్‌గా చేసిన తర్వాత ఈ సంఖ్య పెరిగిందని సచిన్‌ పైలట్‌ పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. పార్టీలో వయసు పైబడుతున్న నాయకులు యువతకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తాజాగా వీటిపై పరోక్షంగా స్పందించిన ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌.. మోదీ వేవ్‌ వల్లే 2013లో తాము భారీ ఓటమి చెందామన్నారు. అయితే, కేవలం ఆరు నెలల్లోనే ప్రజలు తమ తప్పిదాన్ని తెలుసుకున్నారని.. ఈసారి మాత్రం అలా జరగదన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు, కార్యక్రమాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. మరికొన్ని నెలల్లో రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అగ్ర నేతల మధ్య ఇలా ఆధిపత్య పోరు మళ్లీ మొదలవ్వడం కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ఇబ్బంది కలిగించే విషయంగా కనిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని