Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌

మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థి పేరును కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. మాజీ ఎంపీ దివంగత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి

Updated : 09 Sep 2022 15:16 IST

హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థి పేరును కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. మాజీ ఎంపీ దివంగత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ఖరారు చేసింది. అభ్యర్థిగా స్రవంతిని ఎంపిక చేసినట్లు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్‌ వాస్నిక్ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ టికెట్‌ కోసం పలువురు పోటీ పడ్డారు. స్రవంతితో పాటు స్థానిక నేతలు చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్‌, కైలాష్‌ తదితరులు టికెట్‌ను ఆశించారు. ఆశావహులు ఎక్కువగా ఉండటంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వారితో ప్రత్యేకంగా సమావేశమై అభిప్రాయాలను సేకరించారు. టికెట్‌ ఆశిస్తున్న అభ్యర్థుల బలాలు, బలహీనతలపై ఏఐసీసీకి నివేదిక పంపించారు. టీపీసీసీ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్‌ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది.

పాల్వాయి స్రవంతిని మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిగా ప్రకటించడంపై కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని.. అదే స్ఫూర్తితో ముందుకెళ్తామన్నారు. మునుగోడులో మళ్లీ కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తామని మాణికం ఠాగూర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

భాజపా అభ్యర్థిగా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేరు ప్రచారంలో ఉంది. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్‌ పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన.. అనంతరం మునుగోడులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేంద్రహోంమంత్రి అమిత్‌షా సమక్షంలో భాజపాలో చేరారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డినే భాజపా తమ అభ్యర్థిగా ప్రకటించనుందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు తెరాస అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని