
Up Elections: ప్రియాంక ఎఫెక్ట్.. భాజపాలో మహిళలకు ప్రాధాన్యం!
లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు అన్ని పార్టీల్లో మహిళలకు ప్రాధాన్యం పెరిగిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. తాజాగా మహిళా నేతలతో భాజపా నిర్వహించిన భారీ ర్యాలీనే ఇందుకు ఉదాహరణ అని.. దీన్నే ‘ప్రియాంక ఎఫెక్ట్’ అంటారని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు.
ఆదివారం రాష్ట్ర రాజధానిలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో భాజపా మహిళా నేతలు ‘మహిళల భద్రత’పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఇటీవల భాజపాలో చేరిన అపర్ణయాదవ్(సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు), ప్రియాంక మౌర్య సహా పలువురు మహిళా నేతలు పాల్గొన్నారు. కాగా.. ఈ ర్యాలీపై యూపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అజయ్ కుమార్ స్పందించారు.
‘‘నేను మహిళను.. పోరాడగలను’ అనే నినాదంతో ప్రియాంక గాంధీ ప్రజల్లోకి వెళ్తున్నారు. మహిళల సమస్యలపై గళమెత్తుతున్నారు. ఈ క్రమంలోనే మా పార్టీ అభ్యర్థుల్లో 40శాతం టికెట్లు మహిళలకే కేటాయిస్తున్నాం. జనాభాలో సగం మంది మహిళలు ఉన్నప్పుడు.. వారిని ఏ పార్టీ నిర్లక్ష్యం చేయకూడదని ప్రియాంక గాంధీ భావిస్తున్నారు. ఇప్పుడు అదే జరుగుతోంది. మహిళలకు భాజపా ప్రాధాన్యమిచ్చి.. వారితో భారీ ర్యాలీ నిర్వహించడం ‘ప్రియాంక ఎఫెక్ట్’గానే అనిపిస్తుంది’’అని అజయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతి కోసం భాజపా నిజంగా పాటుపడి ఉంటే.. ఇతర పార్టీల్లో పేరు ప్రఖ్యాతలు సాధించిన మహిళా నేతలను వారి పార్టీలోకి చేర్చుకునేది కాదని అజయ్ చెప్పుకొచ్చారు.