PM Modi : ఈవీఎంలపై ఆరోపణలంటే.. కాంగ్రెస్‌ తన ఓటమిని అంగీకరించినట్లే..!

ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని కాంగ్రెస్ ఆరోపణలు చేయడం.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఇప్పటికే తన ఓటమిని అంగీకరించిందనడానికి నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తర గుజరాత్‌లోని పాటణ్‌ టౌన్‌లో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు.

Published : 02 Dec 2022 23:13 IST

గాంధీనగర్‌: ఈవీఎంలను ట్యాంపరింగ్ (EVM Tamparing) చేశారని కాంగ్రెస్ (Congress) ఆరోపణలు చేయడం.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఇప్పటికే తన ఓటమిని అంగీకరించిందనడానికి నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. తొలి విడతలో భాగంగా గుజరాత్‌(Gujarat)లోని 89 స్థానాలకు గురువారం ఓటింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. రెండో విడతలో పోలింగ్‌ జరగనున్న ఉత్తర గుజరాత్‌లోని పాటణ్‌ టౌన్‌లో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని మిగతా 93 స్థానాలకు డిసెంబరు 5న పోలింగ్‌ నిర్వహించనున్నారు.

‘కచ్‌, సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లలో ఓటింగ్‌ ముగిసిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ఈవీఎంలపై ఆరోపణలు ప్రారంభించింది. ఈ తీరు చూస్తుంటే.. ఆ పార్టీ తమ ఓటమిని, భాజపా విజయాన్ని అంగీకరించిందని స్పష్టమవుతోంది! ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపించడం.. పోటీలోంచి కాంగ్రెస్‌ వైదొలిగిందనడానికి సూచన’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్‌కు రెండే విషయాలు తెలుసు. ఒకటి.. ఎన్నికల ముందు ఓటర్లను ఆకట్టుకునేందుకుగానూ మోదీని దూషించడం. రెండోది.. ఓటింగ్‌ తర్వాత ఈవీఎంలపై ఆరోపణలు చేయడం. కాంగ్రెస్‌ తన ఓటమిని అంగీకరించిందన్న విషయాన్ని ఇది నిరూపిస్తోంది’ అని మోదీ అన్నారు.

గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు.. సంపన్నులు, పేదల మధ్య విభజనను మరింత పెంచాయని, పేదల సంక్షేమ నిధులను దోపిడీ చేశాయని మోదీ విమర్శలు చేశారు. ‘కేంద్రం పంపిన రూ.1లో కేవలం 15 పైసలు మాత్రమే పేదలకు చేరుతోందని కాంగ్రెస్‌ మాజీ ప్రధాని ఒకరు చెప్పేవారు’ అని  రాజీవ్‌గాంధీ వ్యాఖ్యను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘ఆ రోజుల్లో స్థానిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాబట్టి.. మిగతా 85 పైసలు ఎవరు స్వాహా చేశారు?’ అని ప్రశ్నిస్తూ.. కాంగ్రెస్ ఎన్నికల గుర్తు ‘హస్తాన్ని’ చూపుతూ ఎద్దేవా చేశారు. తాను ప్రధాని అయిన తర్వాత ఈ అక్రమాలను అరికట్టినట్లు చెప్పారు.

సర్దార్‌ పటేల్‌ను కాంగ్రెస్‌ తిరస్కరించింది..

సర్దార్ వల్లభభాయ్ పటేల్‌ను కాంగ్రెస్ తిరస్కరించిందని, స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ వారితో కలిసి పనిచేసిన కారణంగా.. ఆ పార్టీ బానిస మనస్తత్వాన్ని అలవర్చుకుందని ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ఆనంద్‌ జిల్లాలోని సోజిత్రా పట్టణంలో నిర్వహించిన ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌కు సర్దార్ పటేల్‌తో మాత్రమే కాకుండా.. దేశ ఐక్యతతోనూ సమస్య ఉంది. ఎందుకంటే వారి రాజకీయాలు.. ‘విభజించు.. పాలించు’ విధానంపై ఆధారపడి ఉన్నాయి. ఈ కారణంగా.. కాంగ్రెస్ ఎప్పుడూ పటేల్‌ను తమ వ్యక్తిగా భావించలేదు’ అని ప్రధాని ఆరోపించారు. రాష్ట్రంలోని పటేల్‌ విగ్రహాన్ని సందర్శించకుండా ప్రతిపక్ష నేతలు తప్పించుకు తిరుగుతున్నారన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు