Congress: హస్తం పార్టీ అధ్యక్ష పదవికి శశిథరూర్‌ పోటీ ఖరారు

కాంగ్రెస్‌(Congress) అధ్యక్ష పదవికి పార్టీ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ (Shashi Tharoor) పోటీ ఖరారైంది. ఈ మేరకు శనివారం ఆయన నామినేషన్‌ పత్రాలు తీసుకున్నారు. దీంతో ఈ పదవి రేసులో....

Updated : 24 Sep 2022 16:19 IST

దిల్లీ: కాంగ్రెస్‌(Congress) అధ్యక్ష పదవికి పార్టీ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ (Shashi Tharoor) పోటీ ఖరారైంది. ఈ మేరకు శనివారం ఆయన నామినేషన్‌ పత్రాలు తీసుకున్నారు. దీంతో ఈ పదవి రేసులో అధికారికంగా బరిలో దిగిన మొదటి అభ్యర్థిగా నిలిచారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమంటూ తన ఉద్దేశాన్ని వ్యక్తపరచిన తొలి నేత కూడా శశిథరూరే. ఈ మేరకు ఇటీవల పార్టీ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)ని కలిసి.. ఇదే విషయాన్ని చెప్పారు. అందుకు ఆమె గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి! పార్టీలో సంస్థాగతపర సంస్కరణలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తోన్న రెబల్‌ గ్రూపు ‘జీ-23’లో ఉన్న థరూర్‌.. ప్రస్తుతం అధ్యక్ష ఎన్నిక బరిలో నిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోవైపు.. తానూ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగనున్నట్లు రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌(Ashok Gehlot) ఇప్పటికే ప్రకటించారు. అధ్యక్షుడిగా తిరిగి బాధ్యతలు స్వీకరించాలని పార్టీ నేతలు చేసిన విజ్ఞప్తులను రాహుల్‌ గాంధీ ఇప్పటికే తిరస్కరించారు. ఈ క్రమంలోనే గహ్లోత్‌ తన పోటీపై స్పష్టతనివ్వడంతో.. రాహుల్‌ బరిలో దిగబోరని దాదాపుగా నిర్ధారణ అయినట్లే! ఈ నేపథ్యంలో థరూర్‌, గహ్లోత్‌ల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. అయితే, గాంధీ కుటుంబం మద్దతు గహ్లోత్‌కే ఉందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికపై ఇప్పటికే షెడ్యూల్‌ విడుదలయింది. అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటినుంచి ప్రారంభమైంది. అక్టోబర్‌ 17న ఎన్నిక జరగనుండగా.. కౌంటింగ్‌, ఫలితం అక్టోబర్‌ 19న వెల్లడవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని