Mallikarjuna Kharge: మోదీజీ ఇంకెన్నిసార్లు అబద్ధాలు చెబుతారు: ఖర్గే

ప్రధాని మోదీ ఇకనైనా అబద్ధాలు చెప్పటం ఆపేయాలని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హితవుపలికారు. ప్రధాని చెప్పే అసత్యాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఆయన ధనిక స్నేహితులు ప్రజలను దోచుకుంటున్న విషయాన్ని గుర్తించాలని కోరారు. 

Published : 28 Nov 2022 01:46 IST

అహ్మదాబాద్‌: ప్రధాని మోదీ అబద్ధాలు చెబుతూ ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్మదా జిల్లాలోని దేడియాపదలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఖర్గే మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్‌ పార్టీ 70 ఏళ్లలో దేశానికి ఏం చేసిందని ప్రధాని మోదీ, అమిత్‌ షా తరచూ ప్రశ్నిస్తుంటారు. కాంగ్రెస్‌ పార్టీ 70 ఏళ్లలో ఏం చేయకపోతే మీకు ప్రజాస్వామ్యం ఉండేది కాదు. తరచూ మిమ్మల్ని మీరు పేదవాడినని చెప్పుకుంటారు. నేను కూడా పేదవాడినే. నేను అత్యంత పేద కుటుంబం, అణగారిన వర్గం నుంచి వచ్చాను. అప్పట్లో మీరిచ్చే టీని తాగేవారు. కానీ, మా టీని ఎవరూ తాగేవారు కాదు’’ అని ప్రధానిని ఉద్దేశించి ఖర్గే విమర్శలు చేశారు. మిమ్మల్ని మీరు పేదవాడిగా చెప్పుకుంటూ ప్రజల వద్ద సానుభూతి పొందడం ఇకనైనా ఆపేయాలని ప్రధానికి సూచించారు.

కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని దోచుకుందని చెప్పే మీరు ఎందుకు ఆదివాసీలకు స్థలాలు ఇవ్వడంలేదని ఖర్గే ప్రశ్నించారు. మీ మద్దతుతో, మీ ధనిక స్నేహితులు మమ్మల్ని దోచుకుంటున్నారని ఎద్దేవా చేశారు.  ‘‘ప్రజలు తెలివైనవారు.  మీరు చెప్పే అబద్ధాలను ఒకటి లేదా రెండు సార్లకు మించి నమ్మరు. ఇంకా ఎన్నిసార్లు మీరు పేదవాడినని, అందరూ నన్ను దుర్బాషలాడుతున్నారని అబద్ధాలు చెబుతారు. ప్రజలు వాటిని నమ్మే స్థితిలో లేరు’’ అని ఖర్గే అన్నారు. ఇక గుజరాత్‌లో డిసెంబరు 1, 5వ తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. డిసెంబరు 8న ఫలితాలను వెల్లడించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు