Congress: రాజస్థాన్‌ సంక్షోభం ఎఫెక్ట్‌.. గహ్లోత్‌ను పోటీ నుంచి తప్పిస్తారా?

రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం.. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలపై ప్రభావం చూపిస్తోంది. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ వర్గీయుల మూకుమ్మడి రాజీనామా

Published : 26 Sep 2022 16:03 IST

జైపుర్‌: రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం.. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలపై ప్రభావం చూపిస్తోంది. రాష్ట్ర పరిణామాల నేపథ్యంలో పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో సీఎం అశోక్‌ గహ్లోత్‌ పోటీపై అనిశ్చితి నెలకొంది. గహ్లోత్‌ వర్గీయుల మూకుమ్మడి రాజీనామా వ్యవహారంపై అధిష్ఠానం అసంతృప్తి చెందింది. గహ్లోత్‌ వర్గంపై చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. మరోవైపు, గహ్లోత్‌ను అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.

రాజస్థాన్‌ రాజకీయ పరిణామాలు, గహ్లోత్‌ వర్గం ఎమ్మెల్యేల తీరుపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులు.. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయనను అధ్యక్ష ఎన్నిక నుంచి తప్పించాలని వారు డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. ‘‘ఇంత జరిగిన తర్వాత ఆయన(గహ్లోత్‌)పై విశ్వాసం ఉంచడం, పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం మంచిది కాదు. అధినాయకత్వ పదవికి ఆయన అభ్యర్థిత్వంపై పునరాలోచించండి’’ అని సీడబ్ల్యూసీ సభ్యులు కోరినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. గహ్లోత్‌ స్థానంలో గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉండే మరో సీనియర్‌ నేతను అధ్యక్ష ఎన్నికలకు సూచించాలని వారు సోనియా గాంధీని కోరినట్లు సమాచారం.

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి దూరంగా ఉండాలని భావించిన గాంధీ కుటుంబం.. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో అశోక్‌ గహ్లోత్‌ను పోటీ చేయాలని సూచించింది. అధిష్ఠానం కోరిక మేరకు గహ్లోత్‌ అందుకు ఒప్పుకున్నారు. అయితే రాజస్థాన్‌ సీఎం కుర్చీ దిగేందుకు మాత్రం ఆయన మొండికేస్తున్నారు. సచిన్‌ పైలట్‌కు రాష్ట్ర పగ్గాలు ఇచ్చేందుకు ఆయన ససేమిరా అంటున్నారు. దీనికి, ఆయన మద్దతుదారులు కూడా వంత పలుకుతూ.. మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశానికి గహ్లోత్‌ వర్గీయులు హాజరుకాకపోవడం, పరిశీలకులుగా వచ్చిన మల్లికార్జున ఖర్గే, అజయ్‌ మాకెన్‌తో భేటీకి వారు నిరాకరించడంతో రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి.

ఖర్గేతో గహ్లోత్‌ భేటీ..

తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం గహ్లోత్‌.. సీనియర్‌ నాయకుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఖర్గే మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అధిష్ఠానానికి వివరించాం. అధ్యక్షురాలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. దాన్ని పార్టీ నేతలంతా పాటించాలి. పార్టీలో క్రమశిక్షణ ఉండాలి’ అని వ్యాఖ్యానించారు.

రేసులో వారి పేర్లు..

ఒకవేళ సంక్షోభం నేపథ్యంలో గహ్లోత్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తే.. పలువురు సీనియర్‌ నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. దిగ్విజయ్‌ సింగ్ లేదా ముకుల్‌ వాస్నిక్‌ను గాంధీ కుటుంబం అధ్యక్ష పదవికి సూచించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ అధ్యక్ష ఎన్నికకు ఎంపీ శశిథరూర్‌ పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని