Rahul gandhi: రాహుల్‌ గాంధీ ఇటలీ టూర్‌.. భాజపా-కాంగ్రెస్‌ మాటల యుద్దం!

రాహుల్‌ గాంధీ పర్యటన.. భాజపా, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. రాహుల్‌ గాంధీకి బాధ్యత లేదంటూ భాజపా విమర్శిస్తే.. రాహుల్‌ వ్యక్తిగత పర్యటనపై

Published : 31 Dec 2021 01:48 IST

దిల్లీ: రాహుల్‌ గాంధీ ఇటలీ పర్యటన.. భాజపా, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. రాహుల్‌ గాంధీకి బాధ్యత లేదంటూ భాజపా విమర్శిస్తే.. ఆయన వ్యక్తిగత పర్యటనను రాద్ధాంతం చేయొద్దని భాజపాపై కాంగ్రెస్‌ పార్టీ ధ్వజమెత్తింది.

దేశంలో ప్రస్తుతం కరోనా, ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయి. దీంతో విదేశాలకు వెళ్లి, వచ్చే ప్రయాణికుల పట్ల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటున్నాయి. మరోవైపు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు హడావుడి మొదలైంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఇటలీకి వెళ్లారు. దీంతో రాహుల్‌ పర్యటన చర్చనీయాంశంగా మారింది. ఒమిక్రాన్‌ విజృంభిస్తున్న వేళ ఆయన విదేశాలకు వెళ్లడం బాధ్యతారాహిత్యమంటూ భాజపా విమర్శించింది. అంతేకాదు.. ఆయన విదేశీ పర్యటన లెక్కలను వెలికితీస్తోంది. గతంలో కేంద్ర మంత్రి అమిత్‌షా పార్లమెంట్‌లో రాహుల్‌ గాంధీ పర్యటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 2015 నుంచి 2019 వరకు రాహుల్‌ గాంధీ 247 సార్లు విదేశాలకు వెళ్లారని తెలిపారు. కనీసం ప్రోటోకాల్‌ పాటించకుండా ఆయన పర్యటనలు చేస్తున్నారని అమిత్‌షా విమర్శించారు. ఈ విషయాన్ని భాజపా నేతలు గుర్తుచేస్తున్నారు.

భాజపా తీరుపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. ‘రాహుల్‌ గాంధీ వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఇటలీ వెళ్లారు. భాజపా, ఆ పార్టీ మద్దతుదారులు ఈ విషయాన్ని రాద్దాంతం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు’’ అని ఏఐసీసీ ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా అన్నారు. జనవరి 3న పంజాబ్‌లోని మోగాలో జరగబోయే ర్యాలీకి రాహుల్‌ గాంధీ హాజరవుతారని వెల్లడించారు.

Read latest Political News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని