Kishan Reddy: హామీల అమలులో రాష్ట్ర సర్కారు విఫలం: కిషన్‌రెడ్డి

మహిళలకు ఇచ్చిన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు.

Published : 10 Jul 2024 03:47 IST

రాంనగర్, న్యూస్‌టుడే: మహిళలకు ఇచ్చిన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వ పాలనలో మహిళలకు అన్ని రంగాల్లో న్యాయం జరుగుతోందన్నారు. కాంగ్రెస్‌ సర్కారు మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో ‘నారీ భేరి’ పేరుతో మంగళవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కిషన్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏ ఊరికి వెళ్తే ఆ ఊరి దేవుళ్లపై ఒట్లు పెడుతూ కాలం వెళ్లదీస్తున్నారన్నారు. ఐదేళ్ల పాటు మహిళా మంత్రులు లేని పాలన సాగించిన మహానుభావుడు కేసీఆర్‌ అని, అలాంటి పాలన ప్రపంచంలో ఎక్కడా జరగలేదని పేర్కొన్నారు. భారాస ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్‌ సర్కారు కూడా అప్పులు చేస్తోందన్నారు. మహిళలకు ప్రతి నెలా రూ.2 వేల సాయం, రూ.500కే వంట గ్యాస్‌ సిలిండర్, కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం, రూ.లక్ష నగదు, యువతులకు స్కూటీల పంపిణీ హామీల అమలు ఊసే లేదన్నారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మినహా.. ఏ ఒక్క గ్యారంటీని అమలు చేయలేదన్నారు. కొత్త రేషన్‌కార్డుల మంజూరు ఊసే లేదన్నారు. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి.. గ్రామాల్లో మద్యం బెల్టు దుకాణాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ధర్నాలో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా.శిల్పారెడ్డి, ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, భాజపా అధికార ప్రతినిధి రాణి రుద్రమ, మాజీ మేయర్‌ కార్తికరెడ్డి, పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని