Gujarat Elections: స్టేడియం పేరూ మార్చేస్తాం.. కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల

గుజరాత్‌లో అధికారంలోకి వస్తే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం పేరును సర్దార్‌ పటేల్‌ స్టేడియంగా మార్చుతామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ‘జనతానీ సర్కార్‌ (ప్రజల ప్రభుత్వం)’ పేరిట శనివారం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది.

Published : 12 Nov 2022 15:50 IST

గాంధీనగర్‌: గుజరాత్‌(Gujarat)లో అధికారంలోకి వస్తే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం పేరును సర్దార్‌ పటేల్‌ స్టేడియంగా మార్చుతామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ‘జనతా సర్కార్‌ (ప్రజల ప్రభుత్వం)’ పేరిట శనివారం పార్టీ మేనిఫెస్టో(Congress Manifesto)ను విడుదల చేసింది. విద్య, వైద్యం, ఉద్యోగ కల్పన, సంక్షేమం దిశగా హామీలు గుప్పించింది. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌(Ashok Gehlot) మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడితే.. మొదటి కేబినెట్ సమావేశంలోనే ఎన్నికల మేనిఫెస్టోను అధికారిక పత్రంగా ఆమోదిస్తామని ప్రకటించారు.

రాష్ట్రంలో మితిమీరిన అవినీతికి భాజపా ప్రభుత్వానిదే బాధ్యత అని గహ్లోత్‌ ఈ సందర్భంగా ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. గత 27 ఏళ్లలో జరిగిన అవినీతికి సంబంధించిన అన్ని ఫిర్యాదులపై విచారణకు ఆదేశించి, దోషులపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. గుజరాత్‌లో డిసెంబర్ 1, 5వ తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితం వెల్లడిస్తారు.

ముఖ్యమైన హామీలు ఇవే..

* రాష్ట్రంలో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, కాంట్రాక్టు వ్యవస్థ రద్దు

ఒంటరి మహిళలు, వితంతువులు, వృద్ధులకు నెలకు రూ.2,000 చొప్పున ఆర్థిక సాయం

రాష్ట్రవ్యాప్తంగా మూడు వేల ఇంగ్లీష్ మీడియం పాఠశాలల ప్రారంభం, బాలికలకు పీజీ వరకు ఉచిత విద్య

రూ.3 లక్షల వరకు వ్యవసాయ రుణమాఫీ, ఉచిత విద్యుత్తు

పాత పింఛను విధానం(ఓపీఎస్‌) అమలు

నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 చొప్పున భృతి, రూ.500కే గృహావసరాలకు గ్యాస్ సిలిండర్ల అందజేత, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు

గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స, రూ.5 లక్షల వరకు ఫ్రీ హెల్త్ చెకప్‌, ఔషధాల అందజేత, కొవిడ్‌ పరిహారం కింద రూ.4 లక్షలు అందజేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని