Rajasthan Crisis: కమల్‌నాథ్‌కు కాంగ్రెస్‌ అధిష్ఠానం పిలుపు..ఎందుకో?

రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌కు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. తక్షణమే దిల్లీకి రావాలని అధినేత్రి సోనియాగాంధీ ఆదేశించారు...

Published : 26 Sep 2022 17:59 IST

దిల్లీ: రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌కు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. తక్షణమే దిల్లీకి రావాలన్న అధినేత్రి  ఆదేశాల మేరకు ఇవాళ సాయంత్రం సోనియాగాంధీతో ఆయన భేటీ అయ్యారు. రాజస్థాన్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని గట్టెక్కించేందుకే ఆయన్ను దిల్లీకి పిలిపించి మాట్లాడుతున్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల వ్యవహారం రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభానికి తెరలేపుతోంది. అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సిద్ధమైన ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ సీఎం కుర్చీని సచిన్‌ పైలట్‌కు ఇచ్చేందుకు నిరాకరించడమే ఇందుకు కారణం. ఒక వేళ అదే జరిగితే మూకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు అశోక్‌ గహ్లోత్‌ వర్గీయులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే  92 మంది ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్‌ సీపీ జోషి నివాసానికి వెళ్లి రాజీనామాలు సమర్పించినట్లు రాష్ట్రమంత్రి గోవింద్‌ రామ్‌ తెలిపారు. అయితే స్పీకర్‌ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరోవైపు పార్టీ సీనియర్లు మల్లిఖార్జున ఖర్గే, అజయ్‌ మాకెన్‌ తదితరులు గహ్లోత్‌ వర్గాన్ని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. అందుకే కమల్‌నాథ్‌ను బరిలోకి దించినట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, కమల్‌నాథ్‌ మధ్య సత్సంబంధాలున్నాయి. అందువల్ల ఆయనతో మధ్యవర్తిత్వం నడిపిస్తే సమస్యను పరిష్కరించవచ్చని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని