Karnataka Elections: సీఎం సీటుపై వీడని ఉత్కంఠ.. గురువారమే ప్రమాణస్వీకారం?

Karnataka Elections: కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిని అధిష్ఠానమే నిర్ణయించాలంటూ కర్ణాటక సీఎల్పీ సమావేశంలో ఏకవాక్య తీర్మానం చేశారు. మరోవైపు గురువారం సీఎంతోపాటు, కేబినెట్‌ మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. 

Updated : 14 May 2023 22:37 IST

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్‌ అఖండ విజయంతో నూతన ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కంఠ వీడలేదు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah), కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ (DK Shivakumar) మధ్య సీఎం పీఠం కోసం తీవ్ర పోటీ నెలకొనడంతో.. సీఎం అభ్యర్థిని అధిష్ఠానమే నిర్ణయించాలంటూ సీఎల్పీ సమావేశంలో ఏకవాక్య తీర్మానం చేశారు. మరోవైపు సీఎంతోపాటు కేబినెట్‌ మంత్రులు గురువారం ప్రమాణస్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సీఎల్పీ నిర్ణయాన్ని పార్టీ పరిశీలకులు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లనున్నారు. దీనిపై అధిష్ఠానం చర్చించి మరో రెండు మూడు రోజుల్లోగా సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మొత్తం 224 స్థానాలకు గానూ  135 చోట్ల ఘన విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్న విషయం తెలిసిందే. 

ఫలితాలు వెలువడినప్పటి నుంచి ముఖ్యమంత్రి ఎవరా? అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ మద్దతుదారులు పోటాపోటీగా ఫ్లెక్సీలు కట్టారు. సీఎల్పీ సమావేశం జరుగుతున్న హోటల్‌ వెలుపల ఆయా వర్గాలకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ఈ సమస్యను సావధానంగా పరిష్కరించేందుకు అధిష్ఠానం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. సీఎం అభ్యర్థి ఎంపిక కోసం ముగ్గురు నేతలతో కూడిన పరిశీలకుల బృందాన్ని బెంగళూరుకు పంపింది. ఇందులో మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌ కుమార్‌ శిందే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర సింగ్‌, ఏఐసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి దీపక్‌ బబారియా ఉన్నారు. ఈ క్రమంలోనే సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లతో కాంగ్రెస్‌ పరిశీలకులు ప్రత్యేకంగా భేటీ అయి చర్చించారు. నిర్ణయం ఎవరికి అనుకూలంగా వచ్చినా, పార్టీలో చీలిక రాకుండా మరోవర్గం వారు సహకరించాలని వారికి నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. అయితే, అధిష్ఠానం సుదీర్ఘ అనుభవం కలిగిన సిద్ధరామయ్యకు మళ్లీ సీఎంగా ఛాన్స్‌ ఇస్తుందా? లేదంటే తన వ్యూహాలతో కాంగ్రెస్‌ను విజయ తీరాలకు చేర్చిన డీకే శివకుమార్‌కు అవకాశం ఇస్తుందా?అనే అంశం ఆసక్తిగా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు