Punjab Election 2022: చన్నీనా..? సిద్ధూనా..? ఆప్‌ బాట పట్టిన కాంగ్రెస్..!

అసెంబ్లీ ఎన్నికల వేళ.. పంజాబ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంచుకోవడం కాంగ్రెస్‌కు సంక్లిష్టంగా మారింది.

Updated : 02 Feb 2022 22:35 IST

చండీగఢ్‌: అసెంబ్లీ ఎన్నికల వేళ.. పంజాబ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంచుకోవడం కాంగ్రెస్‌కు సంక్లిష్టంగా మారింది. ఈ విషయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ, ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్‌ నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య పోటీ నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పదవికి రాజీనామా చేసిన తర్వాత తనకే ఎమ్మెల్యేల నుంచి మద్దతు లభించిందని తాజాగా  మరో నేత సునీల్ జాఖడ్‌ వ్యాఖ్యలు చేశారు. వీటన్నింటి మధ్య సీఎం అభ్యర్థిని ఎంచుకోవడానికి కాంగ్రెస్.. ఆప్ బాట పట్టినట్లు తెలుస్తోంది. ప్రజల నుంచే అభిప్రాయం తీసుకోవాలనుకుంటున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  

ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్‌(ఐవీఆర్) కాల్స్ ద్వారా కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రజల నుంచి అభిప్రాయం తీసుకోనున్నట్లు ఆ వర్గాలు చెప్పాయి. ఐవీఆర్‌లో మూడు ఆప్షన్లు ఉంటాయి. మొదటి ఆప్షన్ చన్నీ, రెండో ఆప్షన్ సిద్ధూ, మూడో ఆప్షన్ సీఎం అభ్యర్థి లేకుండా ఎన్నికల వెళ్లడం. ఇదిలా ఉండగా.. ఇలా ఇప్పటికే సర్వే ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిని ఎంచుకోగా.. అదొక స్కామ్ అంటూ సిద్ధూ కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. ఏదిఏమైనప్పటికీ.. చన్నీ, సిద్ధూ వర్గాలు పార్టీ చేసే ప్రకటనపై తీవ్రంగా ఎదురుచూస్తున్నాయి. మరోపక్క పార్టీ ఫిరాయింపులకు వీలులేకుండా చివరి నిమిషంలో అభ్యర్థిని ప్రకటించాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు సమాచారం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని