Telangana News: ప్రభుత్వ వ్యతిరేక ఓటు భాజపాకు మళ్లేలా తెరాస యత్నం: జగ్గారెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.

Updated : 20 Apr 2022 14:09 IST

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. ఏడున్నర ఏళ్లలో కేసీఆర్‌ చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. రాష్ట్ర సమస్యలపై ప్రభుత్వంతో పోరాడాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ తమకు దిశా నిర్దేశం చేశారని వివరించారు. గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పంటలకు గిట్టుబాట ధర దక్కడం లేదని.. రైతు రుణమాఫీపై కేసీఆర్ మాట తప్పారన్నారు. తెరాస పాలనలో సబ్సిడీలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. సీఎం మాటలు నమ్మి వరివేయని రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.

భాజపా కేంద్ర కమిటీ కనుసన్నల్లోనే తెరాస నడుస్తోందని విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌ వైపు రాకుండా తెరాస పార్టీనే భాజపా వైపునకు మళ్లిస్తోందని జగ్గారెడ్డి ఆరోపించారు. రాహుల్‌గాంధీ వరంగల్‌లో నిర్వహించే సభలో రైతు సమస్యలు, ప్రజా వ్యతిరేకపాలనపై ప్రస్తావిస్తారన్నారు. రాహుల్ గాంధీ సభను 5 లక్షల మందితో విజయవంతం చేస్తామన్నారు. ఎన్నికల పొత్తులపై ఏఐసీసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వివరించారు. రామాయంపేట ఘటన నిందితులకు పోలీసులు, ప్రభుత్వ అండదండలున్నాయని జగ్గారెడ్డి ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని