Congress: తెలంగాణ ప్రభుత్వం మహిళలను నిర్లక్ష్యం చేసింది: కృష్ణ పూనియా

తెలంగా ప్రభుత్వం మహిళలను నిర్లక్ష్యం చేసిందని, ఆర్భాటపు ప్రచారాలతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తోందని కాంగ్రెస్‌ నేతలు ఎమ్మెల్యే సీతక్క, రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కృష్ణ పూనియా ఆరోపించారు.

Updated : 05 Jun 2023 16:04 IST

హైదరాబాద్‌: భారాస, భాజపా ఒక్కటేనని రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కృష్ణ పూనియా అన్నారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మరో ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ఆమె మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలను నిర్లక్ష్యం చేసిందని.. 2014 నుంచి ఇప్పటి వరకు వారికి అవమానం జరుగుతోందని ఆరోపించారు.

‘‘2014లో ఏర్పడిన భారాస ప్రభుత్వంలో ఒక్క మహిళకు కూడా మంత్రిమండలిలో స్థానం కల్పించలేదు. భారాస పాలనలో మహిళలపై దాడులు పెరిగాయి. రాష్ట్రంలో చైన్‌ స్నాచింగ్‌, సైబర్‌ దాడులు ఎక్కువయ్యాయి. మద్యాన్ని నియంత్రించడంలో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైంది. తెలంగాణలో ఇప్పటి వరకు మహిళలకు కొత్త పింఛన్లు ఇవ్వలేదు. భారాస ప్రభుత్వం తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి పథకంలో భారాస ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటున్నారు’’ అని ఆమె ఆరోపించారు.

అనవసరపు ఆర్భాటాలే: సీతక్క

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారాలతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తోందని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ప్రజలు ఏం సంతోషంగా ఉన్నారని ఉత్సవాలు చేస్తున్నారని విమర్శించారు. ‘‘పేపర్ లీకేజీని పక్కదారి పట్టిస్తున్నారు. కాంగ్రెస్‌ ఏం తప్పు చేసిందని బంగాళాఖాతంలో కలపాలని కేసీఆర్‌ అంటున్నారు. భారాస, భాజపా ఒక్కటై కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ధరణి పోర్టల్‌ వల్ల రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను కేసీఆర్‌ క్షేత్ర స్థాయిలో పరిశీలించాలి. వీఆర్వో వ్యవస్థను తీసేసి కేసీఆర్‌ రెవెన్యూ వ్యవస్థను భ్రష్టుపట్టించారు’’ అని సీతక్క విమర్శించారు.

తెలంగాణలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని, కేసీఆర్‌ పాలనలో మహిళలకు ప్రాధాన్యత లేదని ఆమె అన్నారు. మనుధర్మశాస్త్రాన్ని అనుసరించడంలో భాజపా, భారాస ఒక్కటేనని అన్నారు. ‘‘కేసీఆర్‌ పాలనలో ‘దిశ’ఘటన జరిగింది. వైద్య కళాశాలలో వేధింపులు తట్టుకోలేక మెడికో ఆత్మహత్య చేసుకుంది. క్రీడాకారులను డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ ఇబ్బంది పెట్టినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఒలింపిక్‌ గేమ్స్‌లో పతకాలు గెలిచిన క్రీడాకారులను కేంద్రం గౌరవించడం లేదు’’ అని సీతక్క విమర్శించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు