
గృహిణులకు పెన్షన్.. శబరిమలకు ప్రత్యేక చట్టం
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ‘ప్రజా మేనిఫెస్టో’ను శనివారం విడుదల చేసింది. గృహిణులకు పింఛన్, ఉచిత బియ్యం, ఉచిత గృహాలు వంటివి ఇందులో ఉన్నాయి. తాము అధికారంలోకి వస్తే 40-60 ఏళ్ల వయసు గల ప్రతి మహిళకూ నెలకు ₹2వేలు అందిస్తామని యూడీఎఫ్ పేర్కొంది. తెల్లరేషన్ కార్డుదారులందరికీ ఐదు కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఐదు లక్షల ఇళ్లు ఉచితంగా నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చింది. శబరిమల అయ్యప్ప ఆలయంలో సంప్రదాయాలను కాపాడేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని యూడీఎఫ్ పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలు రాయబోయే తల్లులకు రెండేళ్లు వయోపరిమితి పెంచుతామని హామీ ఇచ్చింది. కొవిడ్ బారిన పడిన వారికి ఉచిత ఆహార కిట్లు, సామాజిక పెన్షన్లు రూ.2,500కు పెంపు వంటివి హామీల్లో పొందుపరిచింది.
పింఛన్.. సీఏఏ రద్దు.. కరెంట్ ఫ్రీ
గువాహటి: అసోంలో కోల్పోయిన అధికారాన్ని తిరిగి సాధించడమే లక్ష్యంగా రూపొందించిన మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇక్కడ విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి గృహిణికి రూ.2వేలు పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం చెల్లుబాటు కాకుండా చట్టం తీసుకొస్తామన్నారు. 5 లక్షల ఉద్యోగాలు, 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్, తేయాకు తోటల్లో పనిచేసే వారికి కనీస వేతనం రూ.365కు పెంపు వంటి హామీలు అమలు చేస్తామన్నారు. అసోం సంస్కృతిపై భాజపా, ఆరెస్సెస్ చేస్తున్న దాడిని అడ్డుకుని తీరుతామని ఈ సందర్భంగా రాహుల్ హామీ ఇచ్చారు.