Amit Shah: మౌలిక సదుపాయాల పేరుతో డబ్బు దోచుకున్నారు: అమిత్‌ షా

వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన పేరుతో గత ప్రభుత్వం ప్రజా ధనాన్ని దోచుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి ఆమిత్‌ షా ఆరోపించారు. రెండు రోజుల పర్యటనకు గుజరాత్‌ వెళ్లిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా గాంధీనగర్‌లో నిర్వహించిన సమావేశంలో...

Published : 28 Sep 2022 01:26 IST

గాంధీనగర్‌: వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన పేరుతో కేంద్రంలోని గత ప్రభుత్వం ప్రజా ధనాన్ని దోచుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి ఆమిత్‌ షా ఆరోపించారు. రెండు రోజుల పర్యటనకు గుజరాత్‌ వెళ్లిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీనగర్‌లో నిర్వహించిన సమావేశంలో అమిత్‌ షా మాట్లాడుతూ..2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాతే వైద్య రంగంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద దేశ వ్యాప్తంగా 60 కోట్ల మంది ప్రజలకు ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యమందిస్తున్నట్లు చెప్పారు. 2014 తర్వాత వైద్యరంగంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.64వేల కోట్లు కేటాయించామన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ కింద దేశవ్యాప్తంగా 600 జిల్లాల్లోని ఆస్పత్రుల్లో 35 వేల పడకలను ఏర్పాటు చేసినట్లు  చెప్పారు. సమీకృత ప్రయోగశాలలు, పరిశోధన కేంద్రాల కోసం ప్రత్యేకంగా మరో రూ.1,600 కోట్లను మంజూరు చేసినట్లు చెప్పారు.

‘‘ఆస్పత్రుల్లో వైద్యులు కూడా లేకపోతే మౌలిక సదుపాయాల కల్పనకు అర్థమేంటి? వైద్య సదుపాయాల కల్పన పేరుతో గత పాలకులు డబ్బులు దోచుకోవడంలోనే నిమగ్నమైపోయారు. మోదీ అధికారం చేపట్టిన తర్వాతే వైద్యరంగంలో మార్పులు వచ్చాయి’’ అని అమిత్‌ షా అన్నారు. 2013-14 సమయంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 387 వైద్య కళాశాలలు ఉంటే.. ప్రస్తుతం ఆ సంఖ్య 600కి చేరిందని చెప్పారు. దేశంలో ఎంబీబీబీఎస్‌ సీట్ల సంఖ్య 51,348 నుంచి గత ఎనిమిదేళ్లలో 89,875కి పెరిగిందని గుర్తు చేశారు. కొత్తగా పది ఎయిమ్స్‌ (AIIMS) సంస్థలు సేవలందిస్తుండగా..త్వరలో మరో 22 అందుబాటులోకి రానున్నాయని అమిత్ షా చెప్పారు. గుజరాత్‌ అసెంబ్లీ స్థానాలకు డిసెంబరులో ఎన్నికలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని