PM Modi: మా పట్ల యువత విశ్వాసానికి కారణం అదే.. మోదీ

కాంగ్రెస్‌ మోడల్‌(Congress Model) పాలనపై ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల(Gujarat Election 2022) ప్రచారంలో భాగంగా మెహసానా నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు.

Updated : 24 Nov 2022 16:58 IST

మెహసానా: కాంగ్రెస్‌ మోడల్‌(Congress Model) పాలనపై ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల(Gujarat Election 2022) ప్రచారంలో భాగంగా మెహసానా నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన ప్రధాని.. కాంగ్రెస్‌ గత పాలనపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ మోడల్‌ అంటే కులతత్వం, విభజన, ఓటు బ్యాంకు రాజకీయాలేనని.. అవి గుజరాత్‌నే కాకుండా యావత్‌ దేశాన్ని శిథిలం చేశాయంటూ మండిపడ్డారు. కానీ, తమ పార్టీ అలా కాదని.. పక్షపాతం, వివక్ష విధానాన్ని తామెన్నడూ ఆమోదించబోమన్నారు. భాజపా పట్ల యువత విశ్వాసం పెంచుకోవడంలో ఇదే స్పష్టంగా కనబడుతోందని వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్‌ మోడల్‌ అంటే అవినీతి, బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలు, ఒంటెద్దు పోకడలు, కులతత్వం. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ వివిధ కులాల ప్రజల మధ్య వైషమ్యాలు రేపుతున్నారు. ఈ మోడల్‌ ఒక్క గుజరాత్‌నే కాదు.. దేశాన్ని కూడా దెబ్బతీసింది. అందువల్లే దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈరోజు మేం తీవ్రంగా శ్రమిస్తున్నాం. పక్షపాతం, వివక్ష విధానాన్ని భాజపా ఎన్నడూ ఆమోదించదు.. అందుకే యువత మాపై తమ విశ్వాసం ఉంచుతున్నారు’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై రాహుల్‌ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. భాజపా తొలుత యువత, రైతులు, కార్మికుల మనసుల్లో భయాన్ని వ్యాప్తిచేస్తుందని.. అది ప్రవేశించాక దాన్ని హింసగా మారుస్తుందంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో దీటుగా స్పందించిన మోదీ.. కాంగ్రెస్‌ ఎప్పుడూ ప్రజల్ని పేదలుగానే ఉంచుతూ ప్రభుత్వంపై ఆధారపడేలా ఉండాలనే కోరుకుందన్నారు. కానీ, భాజపా విధానాలు భవిష్యత్తులో తమకు మరిన్ని అవకాశాలు కల్పిస్తాయని యువకులు విశ్వసిస్తున్నారని చెప్పారు.

 

గతంలో మెహసానా జిల్లా ప్రజలు తీవ్రమైన నీరు, విద్యుత్ కొరతతో పాటు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్న అంశం 20-25 ఏళ్ల వయసున్న యువతకు తెలియకపోవచ్చన్నారు. ఆ రోజుల్లో కరువు కూడా చాలా సాధారణంగా ఉండేదని.. భాజపా అధికారంలోకి వచ్చాక ప్రకృతి వైపరీత్యాల మధ్య పరిమితమైన వనరుల్ని వినియోగించుకుంటూ గుజరాత్‌ను అభివృద్ధి పథంలో నడిపించామని మోదీ తెలిపారు. అప్పట్లో నీరు, విద్యుత్‌ సమస్యలు ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా ఉండేవని గుర్తు చేశారు. కానీ, ఈరోజు తాము ఆ సమస్యల్ని పరిష్కరించడంతో ప్రతిపక్షాలు ఈ అంశాలపై మట్లాడలేకపోతున్నాయన్నారు. కాంగ్రెస్‌ హయాంలో విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమించిన వారిపై పోలీసులతో కాల్పులు జరిపించారని.. ఆ సమయంలో పలువురు రైతులతో పాటు యువకులు మృతిచెందిన సందర్భాన్ని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ హయాంలో విద్యుత్‌ కనెక్షన్‌ కోసం లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ఆ పరిస్థితిని మారుస్తూ తాము విద్యుత్‌ రంగంలో సంస్కరణలు ప్రారంభించినట్టు తెలిపారు. 20ఏళ్ల క్రితం రాష్ట్రంలో కేవలం 5లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉండగా.. ఇప్పుడు విద్యుత్‌ కనెక్షన్ల సంఖ్య 20లక్షలకు చేరిందన్నారు. అలాగే, సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి 8వేల మెగావాట్లకు చేరగా.. పవన ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి 10వేల మెగావాట్ల మార్కును తాకిందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు