Harish Rao: నిరుద్యోగులపై కనికరం లేని కాంగ్రెస్‌

తమ సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటూ నిరుద్యోగ యువత ప్రజాదర్బార్‌కు వెళ్లి కాళ్లావేళ్లా పడ్డా కాంగ్రెస్‌ ప్రభుత్వం కనీసం కనికరించడం లేదని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో లేనిపోని హామీలిచ్చి రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. ఇప్పుడెందుకు ఇచ్చిన మాట తప్పుతోందని ఆయన నిలదీశారు.

Published : 18 Jun 2024 03:01 IST

25 వేల పోస్టులతో డీఎస్సీ నిర్వహించాలి
కేసీఆర్‌ బొమ్మ ఉందనే  సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు ఇవ్వట్లేదు
మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శ

హరీశ్‌రావుకు వినతిపత్రం ఇస్తున్న నిరుద్యోగులు. చిత్రంలో అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి, మధుసూదనాచారి, పొన్నాల లక్ష్మయ్య

ఈనాడు, హైదరాబాద్‌: తమ సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటూ నిరుద్యోగ యువత ప్రజాదర్బార్‌కు వెళ్లి కాళ్లావేళ్లా పడ్డా కాంగ్రెస్‌ ప్రభుత్వం కనీసం కనికరించడం లేదని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో లేనిపోని హామీలిచ్చి రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. ఇప్పుడెందుకు ఇచ్చిన మాట తప్పుతోందని ఆయన నిలదీశారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ దగ్గరికి వెళ్తే అంతా ప్రభుత్వం చేతుల్లో ఉందని చేతులెత్తేశారని, తెజస అధ్యక్షుడు కోదండరాం దగ్గరికి వెళ్లినా ఆయన స్పందించడం లేదని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో భారాస ఎమ్మెల్సీ మధుసూదనాచారి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులతో కలిసి హరీశ్‌రావు సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘గ్రూప్‌ 1 ప్రధాన పరీక్షకు ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులను కాకుండా.. 100 మందిని ఎంపిక చేయాలని భారాస ప్రభుత్వ హయాంలో భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. ఇప్పుడు నిరుద్యోగులు అదే కోరుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉంది. కాబట్టి ఒక్కో పోస్టుకు 100 మంది అభ్యర్థులను ఎంపిక చేయాలి. గ్రూప్‌ 2కు 2వేల ఉద్యోగాలు, గ్రూప్‌ 3కి 3 వేల పోస్టులను అదనంగా కలుపుతామన్న మీ మాట నిలబెట్టుకోవాలి. ఒక్కో ఉద్యోగ పరీక్షకు మధ్య 2 నెలల కాలవ్యవధి ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఏడాదిలోగా 2 లక్షలు ఉద్యోగాలిస్తామని, జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకోవాలి. 11 వేల ఉద్యోగాలతో కాకుండా.. మొత్తం 25 వేల పోస్టులతో డీఎస్సీ నిర్వహించాలి. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. పింఛన్లను పెంచింది. తెలంగాణలోనూ పింఛన్లను పెంచాలి. 

అంగన్‌వాడీలు, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించాలి 

ఆశా ఆరోగ్య కార్యకర్తలు, అంగన్‌వాడీ, జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగులు, గ్రామీణ పారిశుద్ధ్య కార్మికులకు రెండు నుంచి ఐదు నెలలుగా వేతనాలు అందడంలేదు. వీరికి వెంటనే వేతనాలు చెల్లించాలి. ముఖ్యమంత్రి సహాయనిధికి సంబంధించి 65 వేల చెక్కులు ప్రింట్‌ అయి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. చెక్కుతోపాటు ఇచ్చే లేఖలో కేసీఆర్‌ బొమ్మ ఉందనే కారణంతో ఆపారు. కావాలంటే మీ ఫొటో పెట్టైనా సరే.. వెంటనే సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు విడుదల చేయాలి. నీట్‌ పరీక్షలో అక్రమాలు జరిగాయని సందేహాలున్న తరుణంలో సుప్రీంకోర్టు సిటింగ్‌ జడ్జితో గానీ లేదా సీబీఐ, ఈడీలతో గానీ వెంటనే కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలి. తెలుగు విద్యార్థులకు అన్యాయం జరగకుండా భాజపా కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు ఈ విషయంలో స్పందించాలి’’ అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. కొన్ని సామాజిక మాధ్యమ ఛానళ్లు సంచలనాల కోసం తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాటి తీరు మార్చుకోకపోతే లీగల్‌గా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని