Congress: పసిఘాట్‌ To పోరుబందర్‌.. కాంగ్రెస్‌ మరో యాత్ర?

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పసిఘాట్‌ (pasighat) నుంచి గుజరాత్‌లోని పోరుబందర్‌ (porbandar) వరకు తూర్పు-పడమరల మధ్య మరో యాత్ర చేపట్టాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఈ మేరకు పార్టీ జనరల్‌ సెక్రెటరీ జైరాం రమేశ్‌ తెలిపారు.

Published : 26 Feb 2023 18:43 IST

నయా రాయ్‌పూర్‌: కన్యాకుమారి (Kanya kumari) నుంచి కశ్మీర్‌ (Kashmir) వరకు 4,400 కి.మీ మేర కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ (Bharat jodo yatra) పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపిందని పార్టీ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేశ్‌ (Jairam Ramesh) అన్నారు. ఈ స్ఫూర్తితోనే తూర్పు- పడమరల మధ్య మరో యాత్ర చేపట్టాలని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు చెప్పారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని పసిఘాట్‌ (pasighat) నుంచి గుజరాత్‌లోని పోరుబందర్‌ (Porbandar) వరకు యాత్ర చేపట్టే అవకాశముందని తెలిపారు. భారత్‌ జోడోయాత్రను నాలుగు నెలలపాటు తపస్సులా చేశామని, భవిష్యత్‌లో దానిని మరింత ముందుకు తీసుకెళ్తామని 85వ కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశాల్లో రాహుల్‌ గాంధీ పేర్కొన్న నేపథ్యంలో.. జైరాం రమేశ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఈ సారి చేపట్టబోయే యాత్ర ‘భారత్‌ జోడో యాత్ర’కు కాస్త భిన్నంగా ఉంటుందని జైరాం రమేశ్‌ అన్నారు. ‘‘ ఒకవేళ తూర్పు- పడమరల మధ్య యాత్ర చేపడితే.. పసిఘాట్‌ నుంచి పోరుబందర్‌ వరకు ఉండొచ్చు. అయితే, ఈ యాత్ర.. జోడో యాత్రకు భిన్నంగా ఉంటుంది’’ అని పీటీఐ వార్తా సంస్థకు వెల్లడించారు. జోడో యాత్రతో పార్టీ శ్రేణుల్లో కొత్త శక్తి, ఉత్సాహం నిండాయన్న జైరాం రమేశ్‌ ఈసారి చేపట్టబోయే యాత్రలో భారత్‌ జోడోయాత్రకు సమీకరించినంత విస్తృతంగా  మౌలికసదుపాయాలు ఉండకపోవచ్చని అన్నారు. గతంతో పోల్చుకుంటే యాత్రలో పాల్గొన్న వారు కూడా కాస్త తక్కువగానే ఉండొచ్చని చెప్పారు. తూర్పు, పడమరల మధ్య దట్టమైన అడవులు, నదులు ఉండటం వల్ల కేవలం పాదయాత్ర మాత్రమే కాకుండా ‘మల్టీ మోడల్‌ యాత్ర’గా కార్యక్రమాన్ని రూపొందించే అవకాశముందని చెప్పారు. అయితే ఎక్కువభాగం మాత్రం పాదయాత్రే ఉంటుందని అన్నారు. అన్నీ అనుకూలిస్తే జూన్‌ ముందుగానీ, నవంబరు తర్వాత గానీ యాత్ర చేపట్టే అవకాశముందని జైరాం రమేశ్ అన్నారు. మరికొద్ది రోజుల్లో దీనిపై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని