Congress: ప్రొటెం స్పీకర్‌ ప్యానెల్‌లో ఉండేందుకు విపక్షం ససేమిరా

లోక్‌సభలో ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌కు సహకారం అందించేలా విపక్షం నుంచి నియమితులైన ముగ్గురు సభ్యులు ఆ ప్యానెల్‌లో ఉండేందుకు విముఖత చూపిస్తున్నారు.

Published : 23 Jun 2024 04:16 IST

రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు 

దిల్లీ: లోక్‌సభలో ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌కు సహకారం అందించేలా విపక్షం నుంచి నియమితులైన ముగ్గురు సభ్యులు ఆ ప్యానెల్‌లో ఉండేందుకు విముఖత చూపిస్తున్నారు. ఈ నెల 26న స్పీకర్‌ ఎన్నిక జరిగేటంత వరకు కె.సురేశ్‌ (కాంగ్రెస్‌), టి.ఆర్‌.బాలు (డీఎంకే), సుదీప్‌ బందోపాధ్యాయ్‌ (తృణమూల్‌) ఈ ప్యానెల్‌లో ఉండేలా తొలుత నిర్ణయించారు. ఈ ముగ్గురితోపాటు భాజపా సభ్యులు రాధామోహన్‌ సింగ్, ఫగ్గన్‌సింగ్‌ కులస్తే దీనిలో ఉంటారు. భర్తృహరి నియామకంపై తమ అభ్యంతరాల నేపథ్యంలో ఈ పదవుల్ని ఆమోదించకూడదని విపక్షాలు నిర్ణయించుకున్నాయి. 18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఉభయపక్షాల మధ్య భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఎనిమిదిసార్లు లోక్‌సభకు ఎన్నికైన సురేశ్‌ను కాదని మహతాబ్‌ను ఎంపిక చేయడం ద్వారా నిబంధనలు, సంప్రదాయాలను ప్రభుత్వం ఉల్లంఘించిందని విపక్షం ఆరోపిస్తుండగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు వాటిని తోసిపుచ్చిన విషయం తెలిసిందే. నూతన సభ్యుల ప్రమాణ స్వీకారంలో మహతాబ్‌కు సహకరించేందుకు ప్యానెల్‌లోని తమ సభ్యులు సిద్ధంగా లేరని విపక్ష నేతలు శనివారం వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడానికి చేపట్టిన పోరు ఇంకా ముగిసిపోలేదని శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే తెలిపారు.


నేరన్యాయ నూతన చట్టాలను వాయిదా వేయండి: కాంగ్రెస్‌ 

నేర న్యాయాలపై నూతన చట్టాల అమలును వాయిదా వేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ డిమాండ్‌ చేశారు. గత లోక్‌సభలో 146 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ విధించినప్పుడు బిల్లుల్ని ఏకపక్షంగా ఆమోదించారని, హోంశాఖ స్థాయీ సంఘం కొత్తగా ఏర్పాటై సమగ్రంగా సమీక్షించేవరకు వీటిని అమలు చేయవద్దని ‘ఎక్స్‌’లో విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని