NEET UG Row: ‘నీట్‌’ అక్రమాలపై విచారణకు కాంగ్రెస్‌ డిమాండ్‌

‘నీట్‌’లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.

Published : 22 Jun 2024 04:53 IST

హైదరాబాద్‌లో నిరసన ప్రదర్శన

నిరసన ప్రదర్శనలో మాట్లాడుతున్న బల్మూరి వెంకట్‌. చిత్రంలో దానం నాగేందర్, మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్‌ యాదవ్, విజయారెడ్డి

బషీర్‌బాగ్, న్యూస్‌టుడే: ‘నీట్‌’లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. గాంధీభవన్‌ నుంచి బషీర్‌బాగ్‌లోని బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వరకు నిర్వహించిన ప్రదర్శనలో పార్టీ కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నారన్నారు. ‘నీట్‌’ను రద్దు చేయాలని, సీబీఐ విచారణ జరిపించాలన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మాట్లాడుతూ విద్యార్థుల పక్షాన రాహుల్‌గాంధీ పోరాడుతున్నారన్నారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ మాట్లాడుతూ సిటింగ్‌ న్యాయమూర్తితో విచారణ జరిపించాలన్నారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ల అపాయింట్‌మెంట్‌ అడిగితే ఇవ్వలేదని.. వారిద్దరూ ఉత్సవాలు, సంబరాలు చేసుకోవడం కాదని, విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, కార్పొరేటర్‌ విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని