Congress Chintan Shivir: కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్‌ పాదయాత్ర?

దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా భారీ పాదయాత్ర నిర్వహించాలని ఓ కమిటీ ప్రతిపాదించినట్లు సమాచారం.....

Updated : 15 May 2022 12:23 IST

చింతన శిబిరంలో ప్రతిపాదన!

ఉదయ్‌పూర్‌: పార్టీకి పూర్వవైభవమే లక్ష్యంగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ‘నవసంకల్ప చింతన శిబిరం’లో మరో కీలక ప్రతిపాదన చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా భారీ పాదయాత్ర నిర్వహించాలని ఓ కమిటీ ప్రతిపాదించినట్లు సమాచారం.

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు నిరుద్యోగ సమస్యను లేవనెత్తుతూ ఈ పాదయాత్రను కొనసాగించాలని ‘సస్టెయిన్డ్‌ అజిటేషన్‌ కమిటీ’ ప్రతిపాదించినట్లు ఈ సమావేశాల్లో పాల్గొంటున్న ఓ సీనియర్‌ నాయకుడు తెలిపారు. ఏడాది పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ సహా సీనియర్ నాయకులు మధ్య మధ్యలో చేరాలని సూచించినట్లు పేర్కొన్నారు. దీనిపై ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న దిగ్విజయ్‌ సింగ్‌ పూర్తిస్థాయి ప్రజెంటేషన్‌ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ ప్రతిపాదనపై లోతైన చర్చ కూడా జరిగినట్లు తెలిపారు.

మరోవైపు దేశవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యేందుకు ఈ తరహా కార్యక్రమాన్నే యూత్‌ కమిటీ కూడా సూచించినట్లు సమాచారం. ఈ పాదయాత్రలో భాగంగా అవసరమైన ప్రాంతాల్లో ‘జనతా దర్బార్‌’ పేరిట భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు కార్యక్రమాలు దాదాపు ఖాయమైనట్లేనని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు పార్టీకి సంబంధించిన వివిధ అంశాలపై ప్యానళ్ల కన్వీనర్లు అధినేత్రి సోనియాగాంధీకి నివేదికలు సమర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని