Mallikarjuna Kharge: మోదీజీ.. ఆ హామీలు ఏమయ్యాయి?: ఖర్గే

సాగు చట్టాల రద్దు కోరుతూ ఉద్యమం చేసిన రైతులకు ఇచ్చిన హామీలను ఇప్పటికీ కేంద్రం నెరవేర్చలేదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆరోపించారు. కిసాన్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా కనీస మద్దతు ధర హామీ గురించి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

Updated : 21 Nov 2022 16:17 IST

దిల్లీ: పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. గతేడాది మూడు సాగు చట్టాల రద్దు కోరుతూ రైతులు చేపట్టిన ఉద్యమం విరమించి శనివారంతో ఏడాది పూర్తయిన సందర్భంగా ఖర్గే కేంద్రంపై విమర్శలు చేశారు. ఉద్యమంలో పాల్గొన్న రైతులపై కేసులు ఎత్తివేస్తామని, చనిపోయిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని అప్పట్లో కేంద్రం హామీ ఇచ్చిందని, అయితే వాటిని  ఇప్పటివరకు నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు.

‘‘సాగు చట్టాల రద్దుకు మద్దతుగా ఉద్యమంలో పాల్గొన్న రైతులను కేంద్రం కార్లతో తొక్కించింది. 50 శాతం కనీస మద్దతు ధరపై కేంద్రం నుంచి ఇంకా స్పందనలేదు . ఉద్యమంలో చనిపోయిన 733 మంది రైతులకు ఇప్పటికీ ఆర్థిక సాయం అందలేదు. రైతులపై నమోదైన కేసులను కూడా ఎత్తివేయలేదు’’ అని ఖర్గే ట్వీట్ చేశారు. మూడు సాగు చట్టాల రద్దు కోరుతూ దేశ రాజధానిలో ఏడాదిపాటు రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ చట్టాలపై రైతులను ఒప్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం కావడంతో వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. తర్వాతి రోజును కిసాన్‌ విజయ్‌ దివస్‌గా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది.  జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ కూడా కిసాన్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకొని ఉద్యమంలో చనిపోయిన రైతులకు శనివారం మహారాష్ట్రలో నివాళులు అర్పించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని