Mallikarjun Kharge: అది మా బలహీనత కాదు.. అదే మా బలం: ఖర్గే

హిమాచల్‌లో భాజపా చేసిన అభివృద్ధి ఏం లేదని.. అందుకే కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలతోనే ప్రచారాన్ని సాగిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

Published : 11 Nov 2022 01:12 IST

సిమ్లా: అభివృద్ధికి డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటూ భాజపా.. ఉద్యోగుల పింఛను పథకం ప్రధాన అజెండాగా కాంగ్రెస్‌ పార్టీ హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాన్నిహోరెత్తిస్తున్నాయి. పంజాబ్‌లో మాదిరి అధికార పీఠం దక్కించుకోవాలని ఆప్‌ ప్రయత్నిస్తోంది. ఎవరికివారే విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధ్యక్షపదవి చేపట్టిన తర్వాత మల్లిఖార్జున ఖర్గే తొలి ఎన్నికల ప్రచారంలో భాగంగా హిమాచల్‌లో పర్యటించారు. ఎక్కువ మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉండటం తమ పార్టీ బలహీనత కాదని, అదే పార్టీకి ఎంతో బలాన్నిస్తుందని అన్నారు. నిరుద్యోగం, అధిక ద్రవ్యోల్బణం, పాత పింఛను విధానం (ఓపీఎస్‌) రాష్ట్రంలో ప్రధాన సమస్యలని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పరిష్కరిస్తామన్నారు. 

ఓటమి భయంతోనే

సీఎం జైరామ్‌ ఠాకూర్‌ వైఫల్యాల గురించి భాజపా అధిష్టానానికి తెలిసి.. ఓడిపోతామనే భయంతోనే ప్రధాని మోదీ చరిష్మాతో ఎన్నికల్లో గట్టెక్కాలని భాజపా చూస్తోందని విమర్శించారు. అందుకే అభ్యర్థిని చూసి కాకుండా.. తనని చూసి ఓటేయాలని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో ప్రజలను అభ్యర్థిస్తున్నారని విమర్శించారు. 

సంప్రదాయం కొనసాగుతుంది

హిమాచల్‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న ఖర్గే.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 1980 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఒకే ప్రభుత్వం రెండుసార్లు ఎన్నిక కాలేదని, నవంబరు 12న జరిగే ఎన్నికల ద్వారా ప్రజలు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తారని ఖర్గే గుర్తుచేశారు. 

అదే మా బలం

రాష్ట్రాని ఐదేళ్లు పాలించిన భాజపా చేసిన అభివృద్ధి ఏం లేదని, అందుకే ప్రచారంలో వారు చేసిన పనుల గురించి కాకుండా, కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ‘‘మా పార్టీలో ఎంతో మంది సీఎం అభ్యర్థులు ఉన్నారు. అదే మా బలం’’ అని ఖర్గే అన్నారు. హిమాచల్‌కు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వీరభద్ర సింగ్ సతీమణి ప్రతిభా సింగ్, పీసీసీ అధ్యక్షుడు ముఖేష్‌ అగ్నిహోత్రి, మాజీ పీసీసీ చీఫ్‌ సుఖ్వీందర్‌ సింగ్ సుఖు, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆశా కుమారి, పార్టీలో సీనియర్‌ నాయకుడు కౌల్‌ సింగ్ ఠాకూర్‌ వంటి వారు సీఎం పదవి రేసులో ఉన్నారు.  

సంపూర్ణ మెజార్టీ ఇస్తేనే..

ఇప్పటిదాకా జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినప్పటికీ.. పిరాయింపులను ప్రోత్సహిస్తూ భాజపా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోందని ఖర్గే విమర్శించారు. అందుకే కాంగ్రెస్‌ పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఇవ్వాలని హిమాచల్‌ ప్రజలను కోరుతున్నామని అన్నారు. మంచి పాలనను అందించడమే కాంగ్రెస్‌ సిద్ధాంతం, గతంలో తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, పరిపాలనను గుర్తుచేసుకోవాలని ఖర్గే ఓటర్లను అభ్యర్థించారు. భాజపా పాలనలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఉద్యోగ నియమాకాల్లో అవినీతితో విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నవంబరు 12 తేదీన హిమాచల్‌ ప్రదేశ్‌లో ఓటింగ్ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని